Dussehra 2024: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!
Navadurga: సప్తశతీ మహా మంత్రానికి మూలమైన దేవీకవచంలో నవదుర్గల గురించి స్పష్టంగా ఉంది.ఇంతకీ నవదుర్గలు అంటే ఎవరు? వాటి అవతారం వెనుకున్న ఆంతర్యం ఏంటి!
Dussehra 2024: శరన్నవరాత్రి వేడుకలు ఈ ఏడాది అక్టోబరు 03 నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటూ దుర్గమ్మ 9 అలంకారాల్లో దర్శనమిస్తుంది. ఇవే అసలైన అలంకారాలు...
దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తారు. ఒక్కో ఆలయంలో అలంకారాలు వేర్వేరుగా ఉంటాయి. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పిన తొమ్మిదిమంది దుర్గల గురించి దేవీకవచంలో ఉంది..ఆ తొమ్మిది మందిని నవదుర్గలు అంటారు..
నవదుర్గల శ్లోకం
ప్రథమం శైల పుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్తా
నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
శైలపుత్రి
శివుడి అర్థాంగి అయిన సతీదేవి యోగాగ్నిలో తనని తాను ఆహుతి చేసుకున్న తర్వాత పర్వతరాజైన హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించింది. త్రిశూలం, కమలం ధరించి తలపై చంద్రవంక కలిగి వృషభ వాహనంపై దర్శనమిచ్చే ఈ అమ్మనే..పార్వతి, హైమావతి అని కూడా పిలుస్తారు..
బ్రహ్మచారిణి
ఓ చేతిలో జపమాల మరో చేతిలో కమండలం ధరించి శంకరుడిని పతిగా పొందేందుకు ఘోరతపస్సు చేసిన రూపం ఇది. బ్రహ్మచారిణి దుర్గ అనుగ్రహం సిద్ధిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
చంద్రఘంట
నవదుర్గల్లో మూడో రూపం ఇది..తలపై అర్థచంద్రాకారం ఉండడంతో ఈమెను చంద్రఘంటా అని పిలుస్తారు. సింహవాహనంపై కూర్చుని బంగారు కాంతితో మెరిసిపోయే చంద్రఘంట దుర్గ..పదిచేతుల్లో ఖడ్గం, బాణం సరా పది రకాల అస్త్రాలు ధరించి దర్శనమిస్తుంది. ప్రశాంతంగా కనిపించే చంద్రఘంట దుర్గను దర్శించుకునే మనసులో అలజడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.
కూష్మాండ
కూష్మాండ దుర్గను అష్టభుజాదేవి అని పిలుస్తారు. విశ్వంలో సకల వస్తువులలో ఉండే ప్రాణ తేజస్సు కూష్మాండ దుర్గ ఛాయే అంటారు. అమ్మవారి 8 చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలం, చక్రం, గద , జపమాల ఉంటాయి. కూష్మాండ దుర్గను పూజిస్తే అనారోగ్యం తొలగి దీర్ఘాయుష్షు లభిస్తుందని భక్తుల విశ్వాసం
స్కందమాత
ఐదో రోజు పూజంచే నవదుర్గ రూపం ఇది. ఒడిలో చిన్నారి స్కందుడిని కూర్చోబెట్టుకుని చేతిలో పద్మం ధరించి ఓ చేత్తో అభయముద్ర, మరో చేత్తో కమలం ధరించి ఉంటుంది. స్కందమాతను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
Also Read: అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడున్నాయి - అవి ఎలా ఏర్పడ్డాయి -ఎందుకంత పవర్ ఫుల్!
కాత్యాయని
త్రిమూర్తుల తేజస్సుతో...కాత్యాయని మహర్షి ఇంట పుత్రికగా జన్మించింది "కాత్యాయనీ మాత". నాలుగు భుజాలతో విరాజిల్లే ఈ అమ్మవారి చేతుల్లో అభయ ముద్ర, వరముద్ర, ఖడ్గం, పద్మం పట్టుకుని సింహవాహనంపై కొలువై అనుగ్రహిస్తుంది. కాత్యాయనిని సేవించిన వారికి చతుర్విధ పరుషార్థాల ఫలం సిద్ధిస్తుందని చెబుతారు.
కాళరాత్రి
కాళరాత్రి దుర్గ శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది..జుట్టంతా చెల్లా చెదురుగా ఉంటుంది.. అమ్మవారి కళ్లు భయంకరంగా..నాశిక నుంచి వచ్చే ఉఛ్వాస అగ్నిజ్వాలలు కక్కుతున్నట్టు కనిపిస్తుంది. ఈ అమ్మవారి వాహనం గాడిద. వరముద్ర, అభయముద్ర, ఇనపముళ్ల ఆయుధం, ఖడ్గం ధరించి ఉండే రూపం చూసేందుకు భయంకరంగా ఉంటుంది కానీ..సకల శుభాలు ప్రసాదించే అమ్మ కాళరాత్రిదుర్గ. భక్తిశ్రద్ధలతో కాళరాత్రి దుర్గను పూజిస్తే శత్రుభయం ఉండదు.
మహాగౌరి దుర్గ
వృషభవాహనంపై కొలువై ఉండే మహాగౌరి దుర్గ అభయముద్ర, త్రిశూలం, ఢమరుకం, వరముద్ర కలిగి ఉంటుంది. మహాశివుడి కోసం తపస్సు చేసి నలుపెక్కిన అమ్మవారిని గంగాజలంతో అభిషేకించగానే శ్వేతవర్ఱంలో మెరిసిపోయిందట. ఆ రూపాన్ని మహాగౌరి అని పిలుస్తారు. మహాగౌరి దుర్గను పూజించేవారికి గతజన్మ పాపాలు నశిస్తాయి.
Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!
సిద్ధిధాత్రి
సిద్ధిధాత్రి దుర్గ అంటే సర్వవిధ సిద్ధులను ప్రసాదించే అమ్మ. శంకరుడు కూడా సర్వ సిద్ధులను ఈ అమ్మవారి కృపవల్లే పొందాడని దేవీపురాణలో ఉంది. చక్రం, గద, శంఖం, కమలం పట్టుకుని దర్శనమిచ్చే ఈ రూపాన్ని దర్శించుకుంటే సకల సిద్ధులు కలుగుతాయంటారు..