Places to Visit Around Tirumala and Tirupati : తిరుమల చుట్టుపక్కల చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలివే - మీరెన్ని దర్శించుకున్నారు!
Tirumala: నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రాన్ని ఎన్నిసార్లు దర్శించుకున్నా మళ్లీ మళ్లీ భక్తులు బారులుతీరుతూనే ఉంటారు. అయితే శ్రీ వేంకటేశ్వరుని దర్శనం అనంతరం ఈ క్షేత్రాలన్నీ చూశారా
Places to Visit Around Tirumala and Tirupati: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం తర్వాత...కొండపైన, కొండ కింద..తిరుపతి చుట్టుపక్కల దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తిరుపతి నుంచి ప్రయాణం చేస్తే మూడు గంటలలోపే సమయం పడుతుంది. తిరుమల, తిరుపతి సమీపంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలేంటి? వాటిలో మీరెన్ని దర్శించుకున్నారో చూసుకోండి...
గోవిందరాజస్వామి ఆలయం
రామానుజాచార్యులు నిర్మించిన వైష్ణవ పుణ్యక్షేత్రం గోవిందరాజస్వామి ఆలయం. వెయ్యేళ్లకు పైగా పూజలందుకుంటోన్న ఇక్కడ శయనమూర్తిని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని ప్రతీతి. తిరుపతిలో ఉండే ఈ ఆలయం నిత్యం రద్దీగానే ఉంటుంది.
వరాహస్వామి ఆలయం
తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో కొలువయ్యాడు వరాహస్వామి. వేంకటేశ్వస్వామిని దర్శించుకోవడానికి ముందే వరాహస్వామిని చూడాలని చెబుతారు..ఎందుకంటే ఏడుకొండలు ఈయనవే. వాటిని వేంకటేశ్వరుడికి అప్పగించే ముందు...తనకు కూడా సమానంగా పూజలు జరగాలనే షరతు విధించాడట వరాహస్వామి. అందుకే తిరుపతిలో తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది.
Also Read: గురువాయూర్ కి ఆ పేరెలా వచ్చింది - ఇక్కడ బాలగోపాలుడి విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలుసా!
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి కొలువైన ప్రదేశం శ్రీనివాసమంగాపురం. ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని శ్రీ వేంకటేశ్వరుడు పరిణయం చేసుకున్న పవిత్ర స్థలం ఇది. ఈ క్షేత్రానికి కపిల తీర్థం నుంచి , తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్సులుంటాయి.
పద్మావతి అమ్మవారి దేవాలయం
పద్మావతి దేవి ఆలయం తిరుపతికి సమీపంలోనే ఉంటుంది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే ముందు పద్మావతిని అనుగ్రహం పొందాలని భక్తుల విశ్వాసం..
కాణిపాకం వినాయకుడు
తిరుపతి నుంచి కాణిపాకంకి సుమారు గంటన్నర ప్రయాణం. ఇక్కడ వరసిద్ధి స్వామివారు స్వయంభు. సత్యప్రమాణాలుకు నెలవుగా అసత్యం చెప్పేవారికి ఇక్కడ స్వామివారు సింహస్వప్నం. చిత్తూరు జిల్లాలో ఈ ఆలయం బహుదా నది ఒడ్డున ఉంది..
Also Read: ప్రసవించే కప్పకు.. పాము పడగవిప్పి నీడనిచ్చిన ప్రదేశం - అందుకే అత్యంత పవిత్ర స్థలం!
అర్ధగిరి
కాణిపాకం నుంచి మరో 15 కిలోమీటర్లు దూరంలో ఉంది అర్థగిరి. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొస్తుండగా కొంతభాగం ఇక్కడ పడిందట..అందుకే అర్థగిరి అంటారు. వనమూలికలతో కూడిన ఇక్కడ తీర్థం తీసుకుంటే అనారోగ్యం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
శ్రీకాళహస్తి వాయులింగం
శ్రీ కాళహస్తి దేవాలయాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. పరమేశ్వరుడు పంచభూతలింగాలుగా కొలువైన క్షేత్రాల్లో శ్రీ కాళహస్తిలో వాయులింగంగా ఉద్భవించాడు. ఇక్కడ పార్వతీదేవి జ్ఞాన ప్రసూనాంబగా పూజలందుకుంటోంది.
వైకుంఠ తీర్ధం
తిరుపతి నుంచి వందకిలోమీటర్లు దాటివెళితే వైకుంఠ తీర్థం చేరుకోవచ్చు..రామాయణ కాలంలో వానరసేన ఈ తీర్థం వద్దే ఉండేదని చెబుతారు. ఇక్కడ పవిత్ర జలంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శ్రీపురం గోల్డెన్ టెంపుల్
తిరుపతి నుంచి దాదాపు రెండున్నర గంటలు ప్రయాణం చేస్తే.. తమిళనాడులోని వెల్లూరులో స్వర్ణదేవాలయాన్ని చేరుకోవచ్చు. సాధారణంగా స్వర్ణదేవాలయం అంటే అమృత్ సర్ గుర్తొస్తుంది కానీ ఈ ఆలయానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఈ స్వర్ణ దేవాలయం పేరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ .. శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు.
తుంబురు తీర్ధం
తిరుపతికి దాదాపు 8 కిలోమీటర్లదూరంలో ఉన్న తుంబురతీర్థంలో నీటికి అద్భుతమైన శక్తులున్నాయంటారు. సకలపాపాలను రూపుమాపి మోక్షాన్ని ప్రసాదించే తీర్థం ఇది అని నమ్ముతారు. ఇక్కడ ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి..
కపిల తీర్ధం
తిరుమల కొండపై మెట్ల బాటలో ఉన్న శైవ క్షేత్రం కపిల తీర్థం. కపిల ముని ప్రతిష్టించిడం వల్ల ఇక్కడ శివలింగాన్ని కపిలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో జలపాతం ప్రత్యేక ఆకర్షణ...
బేడి ఆంజనేయస్వామి ఆలయం
తిరుపతికి పది కిలోమీటర్లదూరంలో ఉండే బేడీ ఆంజనేయుడి ఆలయం తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం. అల్లరి చేస్తున్న హనుమంతుడిని ఆయన తల్లి కట్టేసి ఆకాశగంగకు తీసుకెళ్లినట్టు స్థలపురాణం..అందుకే ఇక్కడ హనుమంతుడిని బేడీ ఆంజనేయుడు అంటారు..
ఆకాశగంగ
తిరుమల ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆకాశగంగ జలపాతం. నిత్యం కొండపైనుంచి జలపాతం జాలువారుతూనే ఉంటుంది. సమీపంలో మాత ఆలయాన్ని దర్శించుకోవచ్చు...
శిలాతోరణం
సహజసిద్ధంగా శిలలే తోరణంగా ఏర్పడిన ప్రదేశం ఇది. తిరుమలకు 11 కిలోమీటర్ల దూరంలోచారిత్రక వారసత్వ సంపదగా నిలిచే 'శిలాతోరణం' పర్యాటకులను కట్టిపడేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి శిలాతోరణాలు మూడున్నాయి..వాటిలో ఒకటి తిరుమలలో ఉంది.
జింకల పార్కు
తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో తిరుమలకు వెళ్లే దారిలో ఉండే జింకల పార్కు..పర్యాటకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. జింకలకు ఆహారం అందించడంతో పాటూ ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించవద్దు...
శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్
తిరుపతి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ చూపరులను కట్టిపడేస్తుంది..ఇక్కడ జలపాతాలు మరింత ఆకర్షణ...
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!
తలకోన జలపాతం
శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ కు సమీపంలో ఉండే జలపాతం తలకోన..ఎన్నో ఔషధగుణాలుంటే ఈ జలపాతంలో నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఇది మంచి పిక్నిక్ స్పాట్...
శ్రీవారి మ్యూజియం
తిరుపతిలో ఉండే శ్రీవారి మ్యూజియంలో...దేవాలయాల నిర్మాణశైలి, విగ్రహాలు, చిత్రాలు, గ్రంధాలు...మతపరమైన విజ్ఞానాన్ని అందించడంలో సహకరిస్తాయి