Viveka Murder Case: వివేకా హత్య కేసు నుంచి బయటపడేందుకు అవినాష్ రెడ్డి కుట్రలు- ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
Andhra Pradesh News | వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయటపడేందుకు వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుట్ర పన్నారని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.

Avinash Reddy in Viveka Murder Case | అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు (Supreme Court)లో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసును వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టించారని, ఆయన ఆదేశాలతోనే సీబీఐ అధికారి రాంసింగ్, వివేకా కూతురు సునీత, నర్రెడ్డిలపై వివేకా పీఏ కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించింది. వివేకా హత్య కేసును తారుమారు చేసేందుకు, సునీత, నర్రెడ్డి లను ఈ కేసులో ఇరికించాలనే కుట్ర చేస్తున్నారని అదనపు అఫిడవిట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
అవినాష్ రెడ్డి డైరెక్షన్‌లో కేసు విచారణ
రాంసింగ్ పై కేసును మొదట విచారణ చేసిన జి. రాజు ప్రొఫెషనల్ గా విచారించలేదని, తనను అవినాష్ బెదిరించినట్లు జి. రాజు అంగీకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో సూత్రదారులుగా ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ASIG రామకృష్ణ రెడ్డిలు ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాలతో కేసును తప్పుదోవ పట్టించారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంవీ కృష్ణారెడ్డి.. సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌తో పాటు వివేకా కుమార్తె, అల్లుడిపై తప్పుడు ఫిర్యాదు చేశారని అంతా అవినాష్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నవించింది.
కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరు పోలీసు అధికారులతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి కుట్రపూరితంగా అధికారులతో పాటు వివేకానందరెడ్డి కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టించారని అఫిడవిట్ లో తెలిపింది. సీఐ రాజు ఈ కేసు దర్యాప్తు చేయలేదని, అవినాష్ రెడ్డి సూచనలతో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వరరెడ్డి ప్రమేయంతో ఏఎస్సై రామకృష్ణారెడ్డి నివాసంలో కేసు దర్యాప్తు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడే సాక్షులను విచారించి, తప్పుడు స్టేట్మెంట్స్ రికార్డు చేశారని పేర్కొంది. సునీత ఆమె భర్తతో పాటు సీబీఐ అప్పటి ఎస్పీ రాంసింగ్‌లపై చేసిన ఆరోపణలకు ఏఎస్సై రామకృష్ణారెడ్డి ఎలాంటి ఆధారాలను చూపలేదు. దాంతో వీరిపై నమోదు చేసిన కేసు అబద్ధమని, మరిన్ని వివరాలతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టుకు తుది నివేదిక అందించిన ఏపీ ప్రభుత్వం
ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు నేతల ప్రమేయం ఉందని స్టేట్మెంట్ ఇవ్వాలని తనను సీబీఐ ఎస్పీ రాంసింగ్ హింసించారని పులివెందుల కోర్టులో వివేకానందరెడ్డి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ప్రైవేట్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. వివేకా కూతురు సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సైతం తనపై ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమపై నమోదైన కేసు కొట్టివేయాలని వారు కోరగా హైకోర్టు అందుకు నిరాకరించింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2024 మే 10న సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. పులివెందుల డీఎస్పీ బుక్కె మురళి పులివెందుల కోర్టులో దాఖలు చేసిన నివేదిక వివరాలను సమర్పించేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్లికేషన్ పెట్టింది. బుక్కె మురళి సమర్పించిన నివేదికలోని అంశాలను సుప్రీంకోర్టుకు తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

