Kadapa Mayor: కడప మేయర్‌కు పదవీ గండం - 15 రోజుల తర్వాత వేటు ?
Suresh babu: కడప మేయర్ అవినీతికి పాల్పడ్డారని విలిజెన్స్ నిర్దారించడంతో ఆయన పదవిని ఎందుకు తొలగించకూడదో చెప్పాలని ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన పదవికి గండం ఏర్పడింది.

Kadapa Mayor Suresh babu Soon: కడప వైఎస్ఆర్‌సీపీ మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బంధువులకు కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని నిబంధనలను ఉల్లంఘించారని ఎందుకు అనర్హతా వేటు వేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని మేయర్ తన కుటుంబసభ్యుల పేరుతో కాంట్రాక్టులు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన విజిలెన్స్ మేయరు కుటుంబసభ్యులే అత్యధిక కాంట్రాక్టులు చేస్తున్నారని గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక మేరకు ప్రభుత్వం సురేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. పది హేను రోజుల్లో సమాదానం ఇవ్వాలని ఆదేశించింది.
15 రోజుల తర్వాత పదవి నుంచి తొలగింపు ?
కడప మేయర్ తనకు షోకాజ్ నోటీసులు అందలేదని అంటున్నారు. అయితే నోటీసులు అందిన తర్వాత ప్రతి ఆరోపణకు సమాధానమిస్తానని ప్రకటించారు. రాజకీయ కుట్రతోనే తనపై విజిలెన్స్ విచారణ చేయించారని అంటున్నారు. పదిహేను రోజుల్లోపుల వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమాధానం ఎలా ఉన్నా ఆయనను పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు..,, ఆయన అవినీతిపై విచారణ చేయించాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి పట్టుబడుతున్నారు. తర్వలో కడప కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. జగన్ కు అత్యంత సన్నిహితునిగా ఉన్న కడప మేయర్ తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్పొరేషన్ లో అవినీతిపై ఎమ్మెల్యే పోరాటం
కడప ఎమ్మెల్యే, టీడీపీ నేత మాధవి రెడ్డి.. కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న అవినీతిపై తీవ్రంగా పోరాడుతున్నారు. కడప టౌన్ లో వైసీపీ ఓడిపోవడానికి మేయర్ సురేష్ అవినీతి కూడా ఓ కారణం అని వైసీపీలోనే విమర్శలు వినిపిస్తూ ఉంటారు. సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా చెబుతారు. కార్పొరేటర్లు కూడా ఆయనకు వ్యతిరేకంగా చాలా ఉన్నారు. ఎన్నికలకు ముందే పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు అవిశ్వాసం పెట్టకపోయినా మేయర్ పదవి మాత్రం పోయే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కార్పొరేషన్ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు కుర్చీ వేయకుండా మేయర్ అవమానించారు. ఇప్పుడు ఆయన కుర్చీకే ఎసరొచ్చిందని చెబుతున్నారు.
కడప రాజకీయాల్లో వైసీపికి వరుస గడ్డు పరిస్థితులు
కడప రాజకీయాల్లో వైసీపీకి వరుసగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా పట్టు కోల్పోయారు. కేవలం మూడు అంటే మూడు స్థానాల్లోనే గెలుపొందారు. ఏడు స్థానాలు కూటమి వశమయ్యాయి. జమ్మలమడుగులో బీజేపీ, రైల్వేకోడూరులో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్ పదవి కోసం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జడ్పీటీసీలను క్యాంపునకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉపఎన్నికలో జడ్పీని కోల్పోతే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు మేయర్ సీటు కూడా పోతే.. వైసీపీ పట్టు మరింత కోల్పోయనట్లవుతుంది.





















