Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
property tax interest waiver | ఆర్థిక సంవత్సరం కొన్ని రోజుల్లో పూర్తి కానుండగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆస్తి పన్ను బకాయిలు, వడ్డీలను రాబట్టేందుకు భారీగా రాయితీలు ప్రకటించాయి.

Property Tax in Telangana | హైదరాబాద్: ఆస్తి పన్ను (Property Tax)పై వన్ టైమ్ సెటిల్‌మెంట్ కు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీహెచ్‌ఎంసీ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధి వరకే ఉన్న ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్పించాలని ప్రజల నుంచి రిక్వెస్టులు రావడంతో ప్రభుత్వం వారికి అవకాశం కల్పించింది.
2024-25 ఆర్థిక సంవత్సరం వరకు జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణలో అన్ని పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో)లో వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద ఆస్తి పన్నుపై 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి దానకిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ మార్చి 31 వరకు ఆస్తిపన్నుతో పాటు వడ్డీ కేవలం 10 శాతం చెల్లించే వారికి వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ స్కీమ్ ప్రకటించడానికి ముందే ఎవరైనా ఆస్తిపన్నుపై పూర్తి వడ్డీ, బకాయిలు చెల్లించినట్లయితే భవిష్యత్తులో ఆ నగదును అడ్జస్ట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త
అమరావతి: ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలపై ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేశారు.
2024-25 సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ, బకాయిలు 50 శాతం మార్చి 31 లోగా చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ మంగళవారం (మార్చి 25న) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీలో రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

