Kumbhmela Girl Monalisa: కుంభమేళా 'మోనాలిసా'తో సినిమా - దర్శకుడు అరెస్ట్!, కారణం ఏంటంటే?
Kumbh Mela Girl Monalisa: కుంభమేళాలో పూసలమ్ముతూ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన 'మోనాలిసా'కు సినిమాలో ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈమెకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్టైనట్లు తెలుస్తోంది.

Mahakumbh Mela Girl Monalisa Director Sanoj Mishra Arrested: ప్రయాగరాజ్ 'కుంభమేళా'లో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్‌గా మారారు నిరుపేద యువతి 'మోనాలిసా భోంస్లే'. ఈమెకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మూవీ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కిస్తోన్న 'ది డైరీ ఆఫ్ మణిపూర్' (The Diary Of Manipur) సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
సనోజ్ మిశ్రా అరెస్ట్.. ఎందుకంటే?
సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో తనకు అవకాశం ఇస్తానని చెప్పి ఆయన తనను మోసం చేశారంటూ ఝూన్సీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. టిక్ టాక్, ఇన్‌స్టా వేదికగా 2020లో సనోజ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని.. సినిమాల్లో ఛాన్స్ ఇస్తానంటూ ఆయన తరచూ ఫోన్ కాల్స్ చేస్తుండేవాడని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
'అసభ్య వీడియోలు చిత్రీకరించి..'
సనోజ్ ఓసారి ఝాన్సీకి వచ్చి తనకు ఫోన్ చేశాడని.. చెప్పిన చోటుకు రాకపోతే చనిపోతానని బెదిరించాడని.. చేసేది లేక వెళ్లి కలిశానని యువతి చెప్పినట్లు తెలుస్తోంది. తనను రిసార్ట్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి తనను వేధించాడని.. అసభ్య వీడియోలు చిత్రీకరించి బెదిరించాడని పేర్కొంది. ఆ వీడియోలు బయటపెడతానని బెదిరిస్తూ పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు సనోజ్‌ను అరెస్ట్ చేసినట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇలా..
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఎంతోమంది జీవితాలను మార్చేసింది. ఈ క్రమంలోనే ఓ యువతి సైతం సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఆ యువతి మోనాలిసా. ఆమె అందమైన కళ్లు, స్వచ్ఛమైన చిరునవ్వును చూసిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆమెపై ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయారు.
ఓవర్ నైట్‌లోనే స్టార్‌గా మారిన మోనాలిసాకు తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తానని బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తెలిపారు. 'ది డైరీ ఆఫ్ మణిపూర్' మూవీలో ఓ పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి ఆయన మోనాలిసా కుటుంబ సభ్యుల అంగీకారం కూడా తీసుకున్నారు. 'ఈ మూవీ ఓ లవ్ స్టోరీ. మోనాలిసా భోంస్లే ప్రధాన పాత్రలో నటిస్తారు. ఆమెకు నటనలో శిక్షణ కోసం వర్క్ షాప్స్ సైతం నిర్వహిస్తాం. సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభిస్తాం.' అని సనోజ్ తెలిపారు. ఈ మూవీకి మోనాలిసాకు రూ.21 లక్షల రెమ్యునరేషన్ అందించినట్లు తెలుస్తోంది.





















