April Fools Day 2025 : ఏప్రిల్ 1వ తేదీని ఫూల్స్ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? చరిత్ర, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
April Fools Day History : ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఈ స్పెషల్ డే గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు, ఫన్నీ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూసేద్దాం.

April 1st Fools Day 2025 : ఒకరిపై ఒకరు ఫన్నీ జోక్స్ వేసుకోవడానికి.. ప్రాంక్ చేయడానికి కూడా ఓ స్పెషల్ డే ఉంది. అదే ఏప్రిల్ 1వ తేదీ. ప్రతి సంవత్సరం ఈ స్పెషల్ డేని ఫూల్స్ డేగా జరుపుకుంటారు. రోజూ ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి జోక్స్, ప్రాంక్స్ చేసుకుంటారు కానీ.. ఏప్రిల్ 1వ తేదీన ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ మంగళవారం వచ్చింది. మరీ ఈ ఫూల్స్డేని అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటారు. ఈ స్పెషల్ డే గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూసేద్దాం.
ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర ఇదే..
ఏప్రిల్ ఫూల్స్ డేని 16వ శతాబ్ధంలో యూరప్‌లో ప్రారంభమైందని చెప్తారు. ఎందుకంటే అప్పట్లో జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మార్చినప్పుడు జనవరి 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో ఈ ఫూల్స్ డే ప్రారంభమైనట్లు చెప్తారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకుంటారు. వివిధ సంస్కృతులు, ప్రత్యేక సంప్రదాయలకు అనుగుణంగా ఫన్నీ పనులు చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులపై జోకులు వేస్తారు. నీ భుజాలపై సాలెపురుగు ఉందంటూ ఏడిపించడం, నీ వెనుక ఎవరో ఉన్నారని టీజ్ చేయడం వంటి వివిధ అంశాలలో కావాలనే ప్రాంక్ చేయడం వంటివి చేస్తారు. అంతేకాకుండా ఇతరులకు ఫోన్ చేసి.. బర్త్‌డే విషెష్ చెప్పడం వంటి ఫన్నీ ప్రాంక్స్ ఏప్రిల్ మొదటి తేదిన ఎక్కువగా చేస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లను కూడా పోస్ట్ చేసి ఫూల్స్‌ని చేసేందుకు ప్రయత్నిస్తారు.
ప్రాంక్స్ ఎలా ఉండాలంటే..
ఏప్రిల్ ఫూల్స్ డే రోజు మీరు ఎవరినైనా ప్రాంక్ చేయాలనుకుంటే.. అవి కేవలం చిలిపిగా మాత్రమే ఉండాలని గుర్తించుకోండి. మీరు చేసే ప్రాంక్‌లు ఇతరులకు హాని చేయనివై ఉండాలి. ఇతరులకు నష్టం కలిగించకూడదు. సెన్సిటివ్‌గా ఉండేవారితో ఇలాంటి ప్రాంక్స్ చేయకపోవడమే మంచిది. ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఆందోళనకు గురయ్యేవారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఒకరిపై ప్రాంక్ చేస్తున్నప్పుడు.. అవతలి వారు చేసిన ప్రాంక్‌ను కూడా అంతే స్పోర్టివ్‌గా తీసుకోవాలి.
ఏప్రిల్ ఫూల్డ్స్ డే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
- బ్రిటిష్ వార్తాపత్రిక 1698లో లండన్ టవర్‌ని అమ్ముతున్నట్లు ఏప్రిల్ 1వ తేదీన నకిలీ ప్రకటనను ప్రచురించింది.
- ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫూల్స్ డేను పాయిసన్ డి'అవ్రిల్' అంటారు. ఏప్రిల్ ఫిష్ అని దాని అర్థం. ఇరాన్లో దీనిని డోరుగ్ ఎ సిజ్దా అని పిలుస్తారు. పోలాండ్‌లో ప్రిమా అప్రిలిస్ అని పిలుస్తారు.
- స్కాట్లాండ్లో ఏప్రిల్ ఫూల్స్ డేను రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును ఫూల్స్ డే అని.. రెండో రోజును టైలీ డే అని పిలుస్తారు.
- మరొక సిద్ధాంతం ప్రకారం ఏప్రిల్ ఫూల్స్ డేను రోమన్ ప్రజలు మార్చి చివరిలో జరుపుకునేవారట. ఆ సమయంలో మారువేషాలు వేసి.. ఇతరులను ప్రాంక్ చేసేవారట.
ఈ ఏప్రిల్ 1వ తేది ఫూల్స్ డే అనేది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా నవ్వుకునే, ప్రాంక్ చేసుకునే డే. కాబట్టి మీరు కూడా మీ బంధు, మిత్రులతో ఫన్నీ ప్రాంక్‌లు చేసి ఆనందంగా గడిపేయండి.






















