IPL 2025 KKR All Out: అశ్వనీ కుమార్ దెబ్బ అదుర్స్.. కుప్పకూలిన కేకేఆర్.. సీజన్ లో లోయెస్ట్ స్కోరు నమోదు
డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్..ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెత్త ప్రదర్శన చేసింది. కేవలం 116 పరుగులకు ఆలౌటై, ఈ సీజన్ లో లోయెస్ట్ స్కోరు నమోదు చేసింది. అశ్వనీ పేస్ తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు.

IPL 2025 KKR VS MI Live Updates: ముంబై అరంగేట్ర బౌలర్ అశ్వనీ కుమార్ (4-24) డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ని వణికించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ అతని ధాటికి ఈ సీజన్ లో అత్యంత కనిష్ట స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అశ్వనీ తోపాటు మిగతా బౌలర్లు కూడా రాణించడంతో మొత్తం ఓవర్ల కోటా కూడా ఆడలేక పోయింది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశీ (16 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే మిగత బ్యాటర్లు విఫలం కావడం కేకేఆర్ కొంపముంచింది. దీంతో ఈ సీజన్ లోనే కనిష్టంగా 116 పరుగులకు ఆలౌటైంది. కేవలం 98 బంతుల్లోనే కోల్ కతా ఇన్నింగ్స్ ముగియడం విశేషం. ఇక ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లాడిన, అందులో ఓడిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.
Innings Break!
— IndianPremierLeague (@IPL) March 31, 2025
A superb bowling display by the #MI bowlers to dismiss #KKR for 116 in 16.2 overs 🎯@mumbaiindians' chase on the other side ⏳
Scorecard ▶ https://t.co/iEwchzDRNM#MIvKKR pic.twitter.com/R5i58lKBXC
రెండు మార్పులు చేసిన ముంబై..
వరుసగా రెండు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. విల్ జాక్స్, అశ్వనీ కుమార్ జట్టులోకి వచ్చారు. రాబిన్ మింజ్, తెలుగు పేసర్ సత్యనారాయణ రాజు బెంచ్ కే పరిమితమయ్యారు. ఇక కేకేఆర్ కూడా ఒక మార్పు చేసింది. ఆల్ రౌండర్ మొయిన్ అలీ స్థానంలో గాయం నుంచి కోలుకున్న సునీల్ నరైన్ ను తుదిజట్టులోకి తీసుకుంది. ఇక టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేరుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ నిర్ణయం కరెక్టని తేలడానికి ఎంతోసేపు పట్టలేదు.
వికెట్లు టపటపా..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు హారీబుల్ స్టార్ట్ దక్కింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే సునీల్ నరైన్ (0) ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే క్వింటన్ డికాక్ (1) ఔటవడంతో రెండు పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ కు చేరారు. ఈ దశలో కె్ప్టెన్ అజింక్య రహానే (11)తో కలిసి రఘువంశీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ దశలో బంతి అందుకున్న అశ్వనీ.. రహానేను ఔట్ చేసి తన వికెట్ల వేటను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కేకేఆర్ ఖరీదైన ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ (3) మరోసారి విఫలమయ్యాడు. కాసేపటికే ఓపికగా ఆడుతున్న రఘువంశీ కూడా ఔటవడంతో 45 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అశ్వనీ తన మేజిక్ చూపించాడు. వరుసగా రింకూ సింగ్ (17), మనీశ్ పాండే (19), అండ్రీ రసెల్ (5)ను ఔట్ చేసి ఫైవ్ వికెట్ హౌల్ ముంగిట నిలిచాడు. అయితే మిగతా బౌలర్లు రాణించడంతో తనకు ఆ అవకాశం దక్కలేదు. ఇక, రమణ్ దీప్ సింగ్ (12 బంతుల్లో 22, 1 ఫోర్, 2 సిక్సర్) కాస్త వేగంగా ఆడటంతో కేకేఆర్ వంద పరుగుల మార్కును దాటింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా, సంయమనంతో ఆడకుండా, కేకేఆర్ బ్యాటర్లు చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. దీంతో మరో ఓటమి ముంగిట నిలిచింది.




















