Kodali Nani: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి కొడాలి నాని తరలింపు - గుండె ఆపరేషన్ క్లిష్టం !
Kodali To Mumbai: కొడాలి నానిని ఎయిర్ అంబులెన్స్ లో ముంబయి తరలించారు. ఆయన గుండె సమస్య తీవ్రంగా ఉండటంతో అక్కడే బైపాస్ సర్జరీ చేయనున్నారు.

Kodali airlifted to Mumbai: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని అత్యవసరంగా ముంబైకి తరలించారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్పత్రికి తరలించారు. కొడాలి నాని గుండెలో మూడు వాల్వ్‌లు మూసుకుపోవడంతో ఆయనకు అత్యవసరం చికిత్స చేయాల్సి ఉంది. ఆ మూడు వాల్వ్‌లకు స్టంట్స్ వేయాలా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలా అన్నది వైద్యులు నిర్ణయించనున్నారు. ముంబైలోని గుండె వైద్య నిపుణులు రమాకాంత్ పాండేతో కొడాలి నానికి ఆపరేషన్ చేయించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
నాలుగు వాల్వుల్లో మూడు మూసుకుపోవడంతో కొడాలి నానికి అనారోగ్యం
కొడాలి నాని వారం రోజుల కిందట గుండెల్లో మంటగా అనిపించడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన టీం మాత్రం కొడాలి నానికి గుండెపోటు రాలేదని కేవలం గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే ఆస్పత్రిలో చేరారని.. టెస్టుల తర్వాత డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. అయితే ఆయన డిశ్చార్జ్ కాలేదు. గుండెల్లో మూడు వాల్వ్ లు పూడుకుపోవడం తో ఏదో ఒకటి చేయాల్సిందేనని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ కు సిద్ధమయ్యారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఆపరేషన్ సక్సెస్ కావడం ముఖ్యమని భావిస్తున్నారు. కొడాలి నాని వ్యక్తిగత ఆహారపు అలవాట్ల వల్ల.. ఆపరేషన్ కు ఆయన శరీరం సహకరించే స్థితికి ముందుగా తీసుకు రావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలు కూడా వెలుగుచూడటంతో ఆపరేషన్ క్లిష్టం
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కొడాలి నానికి అనేక సమస్యలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలినట్లుగా చెబుతున్నారు. గుండెలో ఉండే 4 వాల్వ్ లలో 3 నాళాలు పూడుకుపోయాయి. అప్పుడే కిడ్నీ సమస్యలు కూడా బయట పడడం జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. గుండెలో మూడు వాల్వ్‌లు పని చేయకపోవడం అత్యంత ప్రమాదకరం. అందుకే అత్యవసరంగా చికిత్స చేయాలని నిర్ణయించారు. కిడ్నీ సమస్యల కారణంగా ఆపరేషన్ క్లిష్టంగా మారినట్లుగా భావిస్తున్నారు. ముంబైలో మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు.. నిపుణులైన వైద్యులు ఉంటారని.. గుండె ఆపరేషన్ ను కిడ్నీ సైతం తట్టుకునేలా చేసి.. సక్సెస్ చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించాలని నిర్ణయించారు. ఆయనతో పాటు ఎనిమిది మంది కుటుంబసభ్యులు కూడా ముంబైకి వెళ్లారు.
ప్రత్యేక విమానంలో ముంబై తీసుకెళ్లిన కుటుంబసభ్యులు
కొడాలి నాని వయసు 53 ఏళ్లు మాత్రమే. అయితే ఆయన వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కారణంగా గుండెకు, కిడ్నికి సమస్యలు వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా ఉండేవారు. జూ.ఎన్టీఆర్ హీరో అయిన తర్వాత ఆయనతో ఒకటి రెండు సినిమాలు తీశారు. నందమూరి హరికృష్ణతో సన్నిహితంగా ఉండేవారు. ఎన్టీఆర్ సిఫారసుతోనే ఆయన గుడివాడ టీడీపీ టిక్కెట్ దక్కించుకున్నారు. అయితే తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయన చంద్రబాబును.. ఆయన కుటుంబాన్ని ఘోరంగా తిట్టడం ప్రారంభించారు. దాంతో ఆయన టీడీపీ క్యాడర్‌కు బద్దశత్రువుగా మారారు.





















