Car Price Hike: ఈ చౌక రేట్లు మళ్లీ కనిపించవు, ఒక్క రోజు ఆలస్యం చేసినా మీకే నష్టం!
Car Price Hike In India: ఏప్రిల్ 01 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంతో పాటు చాలా కార్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచబోతున్నాయి. పాత రేటుకు కార్ కొనాలంటే మార్చి 31 వరకే అవకాశం.

Car Price Hike From 01 April 2025: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి చాలా ఉత్పుత్తులు, సేవల ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ లిస్ట్‌లో కార్లు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 01, 2025 (మంగళవారం) నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. భారత మార్కెట్‌లో చాలా వాహన తయారీ కంపెనీ తమ కార్ రేట్లు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. సాధారణంగా, ఆటో కంపెనీలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు వాహనాల ధరలు పెంచడం పరిపాటిగా మారింది. ఈ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభంలో ఒకసారి రేట్లు పెంచిన ప్రముఖ కార్ కంపెనీలు, ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి రెండోసారి ధరలు పెంచుతున్నాయి.
ఏ బ్రాండ్ రేట్లు ఎంత పెరుగుతాయి?
మన దేశంలో, చాలా వాహన తయారీ సంస్థలు ప్రయాణీకుల వాహనాల ధరలను (Passenger vehicle prices) 3-4 శాతం పరిధిలో పెంచబోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కూడా కార్‌ల ధరలు 2-4 శాతం పెరిగాయి. ఏప్రిల్ నుంచి రేట్లు పెంచే బ్రాండ్‌ల లిస్ట్‌లో మారుతి సుజుకి, కియా, హ్యుందాయ్ నుంచి టాటా మహీంద్రా & లగ్జరీ వాహన తయారీ సంస్థ BMW ఉన్నాయి.
* మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ 01 నుంచి తన అన్ని మోడళ్ల ధరలను (Maruti Suzuki Car New Prices) 4 శాతం వరకు పెంచుతోంది. జనవరి 2025లో కూడా, ఈ జపాన్ ఆటోమేకర్స్ తన వాహనాల ధరలను 4 శాతం పెంచింది.
* హ్యుందాయ్ మోటార్ ఇండియా 2025 జనవరిలో కార్ల ధరలను రూ. 25 వేల వరకు పెంచింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి మళ్లీ 3 శాతం వరకు (Hyundai car new prices) పెంచనుంది.
* టాటా మోటార్స్ కూడా ధరల పెంపును ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో టాటా ప్యాసింజర్ వాహనాల ధరలను 3 శాతం పెంచింది. ఏప్రిల్ నుంచి మరోమారు (Tata Car New Prices) మోత మోగించనుంది.
* మహీంద్రా & మహీంద్రా కార్ రేట్లు (Mahindra car new prices) 3 శాతం వరకు పెరగబోతున్నాయి. ఈ కంపెనీ 2025 జనవరిలో కూడా 3 శాతం పెంచింది.
* కియా ఇండియా 2025 జనవరిలో కార్ల ధరలను 2 శాతం వరకు పెంచింది. ఇప్పుడు, ఈ దక్షిణ కొరియా కంపెనీ తన కార్ల ధరలను (Kia car new prices) 3 శాతం వరకు పెంచబోతోంది.
* లగ్జరీ ఆటోమేకర్ BMW గ్రూప్ ఇండియా కూడా తమ వాహనాల ధరలను (BMW car new prices) 3 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. జనవరిలో రేట్లను ఇదే శాతంలో పెంచింది.
భారతదేశంలో కార్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా & BMWతో పాటు, హోండా, రెనాల్ట్ కార్ రేట్లు కూడా ఏప్రిల్ 01 నుంచి ఖరీదు కాబోతున్నాయి. ఈ అన్ని బ్రాండ్ల కార్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల. నిర్వహణ ఖర్చులు పెరగడం మరో కారణం. కంపెనీలు ఈ ఖర్చుల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని నిర్ణయించడం వల్ల ప్యాసింజర్ వాహనాలు మరింత ప్రియం అవుతున్నాయి.





















