Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
India: నిత్యావసరాల కోసం భారత్ పై బంగ్లాదేశ్ ఆధారపడుతోంది. తాజాగా భారత్ నుంచి బంగ్లాదేశ్ 1.80 లక్షల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.

Bangladesh is dependent on India for essential supplies: బంగ్లాదేశ్ అల్లర్లలో భారత్ ను విలన్ గా చూపిస్తూ అక్కడి వారిని రెచ్చగొడుతున్నారు. కానీ ఆ దేశం నిత్యావసరాల కోసం భారత్ పై ఆదారపడుతోంది.తాజాగా భారత్ నుంచి బంగ్లాదేశ్ 1.80 లక్షల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది.. కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ఇతర నిత్యావసర వస్తువుల కోసం కూడా బంగ్లాదేశ్ ప్రధానంగా భారత్‌పైనే ఆధారపడుతోంది.
ఇంధన భద్రతలో భాగంగా భారత్ నుంచి 1.80 లక్షల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకునేందుకు బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. నుమాలిగఢ్ రిఫైనరీ ద్వారా ఇండో-బంగ్లా ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ మార్గంలో ఈ సరఫరా జరగనుంది. అయితే, కేవలం ఇంధనం మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ ప్రజల రోజువారీ అవసరాలకు కావాల్సిన అనేక వస్తువులను భారత్ భారీగా ఎగుమతి చేస్తూ ఆ దేశ ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.
బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే నిత్యావసరాల్లో బియ్యం, గోధుమలు అగ్రస్థానంలో ఉన్నాయి. తన సొంత అవసరాలు తీరిన తర్వాత భారత్ బంగ్లాదేశ్‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ ధాన్యాలను సరఫరా చేస్తోంది. వీటితో పాటు పంచదార , వంట నూనెలు, వివిధ రకాల పప్పు దినుసులను భారత్ నుంచి బంగ్లాదేశ్ నిరంతరం దిగుమతి చేసుకుంటుంది. బంగ్లాదేశ్ మార్కెట్లో నిత్యావసర ధరలు అదుపులో ఉండటానికి భారతీయ ఎగుమతులు ఎంతగానో దోహదపడుతున్నాయి.
భారత్ నుంచి వెళ్లే ఉల్లిపాయలకు బంగ్లాదేశ్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. భారత్‌లో ఉల్లి ధరలు పెరిగి ఎగుమతులపై నిషేధం విధించిన ప్రతిసారీ బంగ్లాదేశ్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయి. ఉల్లితో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వంటి వస్తువులను కూడా సరిహద్దుల ద్వారా నిత్యం టన్నుల కొద్దీ బంగ్లాదేశ్‌కు తరలిస్తుంటారు. ఇరు దేశాల మధ్య ఉన్న భౌగోళిక సామీప్యత వల్ల రవాణా ఖర్చులు తగ్గి బంగ్లాదేశ్ వినియోగదారులకు ఇవి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి.
మరోవైపు, పారిశ్రామిక , గృహ అవసరాల కోసం పత్తి, నూలు కూడా భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వస్త్ర పరిశ్రమ భారతీయ ముడి పదార్థాలపైనే అధికంగా ఆధారపడి ఉంది. వీటితో పాటు కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులను కూడా భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు ఇటీవల బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతోంది. ప్రత్యేకించి పండుగ సీజన్లలో బంగ్లాదేశ్ అభ్యర్థన మేరకు భారత్ ప్రత్యేక కోటాల ద్వారా ఈ నిత్యావసరాలను సరఫరా చేస్తోంది.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు ఆపత్కాలంలో అండగా నిలుస్తోంది. ఇంధనం నుండి ఆహార పదార్థాల వరకు అన్ని రంగాలలో సహకారాన్ని అందిస్తూ ప్రాంతీయ సుస్థిరతకు తోడ్పడుతోంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ వాణిజ్య బంధం కేవలం ఆర్థిక పరమైనదే కాకుండా, లక్షలాది మంది ప్రజల జీవనాధారంతో ముడిపడి ఉంది. ఈ విషయం తెలిసి కూడా అక్కడి రాజకీయ నేతలు ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు. భారత్ ను శత్రువుగా చూస్తున్నారు.





















