Allahabad High Court Judge: మైనర్ ప్రైవేటుపార్టులు పట్టుకున్నా రేప్ కాదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు - స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
Allahabad High Court: రేప్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. న్యాయమూర్తి సున్నితత్వలోపానికి నిదర్శమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Supreme Court: మైనర్ ప్రైవేటు పార్టులు పట్టుకున్నా సరే అది రేప్ కాదన్న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. బాలిక ఛాతిని పట్టుకోవడం, ఆమె ప్యాంట్ నాడా లాగేయడం లాంటి వాటిని అత్యాచార నేరంగా పరిగణించలేమని ... నిందితుడిపై అభియోగాలను నిరూపించడానికి ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించలేదని అలహాబాద్ హైకోర్టు ఈ నెల 17న వివాదాస్పద తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏ మాత్రం సున్నితత్వం లేని తీర్పని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పు రాసిన వ్యక్తి సున్నితత్వ లోపానికి ఇది నిదర్శనమని చెప్పడానికి తాము బాధపడుతున్నామని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి అన్నారు.
ఈ కేసులో నిందితుడు ఒక అమ్మాయి యొక్క ప్రైవేట్ భాగాన్ని పట్టుకుని, ఆమె పైజామా నాడాను తెంచాడు. అలహాబాద్ హైకోర్టు ఈ చర్యలు IPC సెక్షన్ 376 (అత్యాచారం) కింద నేరంగా నిర్వచించబడవని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు. తీర్పు రిజర్వ్ చేసిన నాలుగు నెలల తర్వాత జస్టిస్ మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు. తీర్పులోని 21, 24, 26 పేరాల్లోని పరిశీలనలు చట్టానికి తెలియనివని, అమానవీయ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్టే విధిస్తున్నామని.. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
2021 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసు నమోదు అయింది. ఓ మమహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు నివాసం ఉండే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆపారు. వారిద్దరూ బాలికను ఇంటి దగ్గర దింపుతామని తల్లిని నమ్మించి బైక్‌పై తీసుకెళ్లారు. అయితే ఆ ఇద్దరూ ఆ బాలికను సమీపంలోని ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక ఛాతి మీద చేతులు వేశారు. నాడా లాగేసి ఆమె ప్యాంట్‌ను తొలగించేందుకు బలవంతం గా చేశారు.
అయితే బాలిక కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దాంతో నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. సుదీర్ఘ కాలం విచారరణ తర్వాత నాలుగు నెలల కిందట తీర్పును రిజర్వ్ చేశారు. మార్చి 17న న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తీర్పు ఇచ్చారు. బాలిక ఛాతిపై చేతులు వేయడం, దుస్తులు పట్టుకుని లాగడం లాంటి చర్యలు అత్యాచారం కిందకు రావని తీర్పు చెప్పారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సైతం దీనిపై స్పందించారు. ఇలాంటి తీర్పులవల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

