Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
Telangana Assembly Sessions | కమీషన్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం ఆరోపణలు చేశారు. 20 శాతం, 30 శాతం కమీషన్ల సర్కార్ అని బీఆర్ఎస్ అంటే, కమీషన్ల కాలేళ్వేరం అని కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు.

Telangana Assembly Sessions | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ చర్చలో భట్టి విక్రమార్క వర్సెస్ కేటీఆర్ గా పరిస్థితి మారిపోయింది. వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన అంటూ అసెంబ్లీ మెట్ల వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఇది పర్సంటేజ్ లా పాలన అంటూ నినాదాలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారుు. ఇదేమి ప్రభుత్వం.. 20 శాతం, 30 శాతం పర్సంటెజీల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కామెంట్లు చేశారు. ఉద్యోగుల బిల్లుల కోసం పర్సంటేజీలా సిగ్గు సిగ్గు అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒళ్లు బలిసి అంటూ వ్యాఖ్యానించారని బీఆర్ఎస్ సభ్యులు భగ్గుమన్నారు. భట్టి చేసిన అనుచిత వ్యాఖ్యలపైన క్షమాణన చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. భట్టి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టు పట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో అసెంబ్లీ అట్టుడుకిపోయింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తనకు 16 సంవత్సరాల నుంచి అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు. తాను తొలిసారి సభకు వచ్చినప్పుడు భట్టి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన పట్ల ఎప్పుడూ గౌరవం ఉంది. ఆయనను మాకు పెద్దన్న లెక్క గౌరవిస్తాం. కానీ ఆది శ్రీనివాస్ ఇప్పుడు లేచి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు. 20 శాతం కమిషన్, 30 శాతం కమిషన్ ప్రభుత్వం అని నేను అనలేను. అనాలంటే నేను అనలేనా ఓటుకు నోటు దొంగ తెలంగాణ ముఖ్యమంత్రి అని అన్నారు. కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారని ఆ విషయంపై చర్య తీసుకోమని అడిగాను. పీసీసీ చీఫ్ పదవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్లకు కొన్నారని మంత్రి కోమటిరెడ్డి చెప్పిన మాటలను నేను కూడా అనవచ్చు కదా అన్నారు.
బీఆర్ఎస్ పాలన అంటే కమీషన్లు..
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు లాబీలోకి వెళ్లి నిరసన తెలిపారు. సభ జరుగుతుంటే వీడియోలు, ఫొటోలు తీయడం నిషేధం ఉందన్నారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించి ఫొటోలు, వీడియోలు తీశారు. వారిపై చర్యలు తీసుకోవాలి. కమీషన్ కె అంటే కాళేశ్వరం, కమీషన్ కె అంటే కరెంట్ కొనుగోళ్లు, కమీషన్ కె అంటే మిషన్ కాకతీయ అని ఆది శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సభలో దుమారం రేగింది.






















