CM Chandrababu: ఆన్లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
AP Betting Act | ఆన్‌లైన్ బెట్టింగ్స్ ద్వారా జీవితాలు నాశనం అవుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ బెట్టింగ్ యాక్ట్ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Collectors conference in Andhra Pradesh | అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్ తో ఎన్నో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ నేరాలపై ఫోకస్ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా ఒక్కరి జీవితం కాదు కుటుంబాలు సైతం నాశనం అవుతున్నాయని వీటికి చెక్ పెట్టాలంటే బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక చట్టం అవసరమని చంద్రబాబు అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లతో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న మూడో సమావేశం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నేరాలకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఉన్నతాధికారులకు సూచించారు. ‘ఏపీలో ఇతర నేరాలు క్రమంగా తగ్గుతున్నా.. ఆర్థిక నేరాలు మాత్రం పెరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గంజాయి సాగు తగ్గింది. ఎక్కడైనా గంజాయి వినియోగం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోండి. టెక్నాలజీ వినియోగం పెంచడం ద్వారా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్స్ లాంటి వాటికి చెక్ పెట్టాలి.
బెట్టింగ్ యాప్‌లకు చెక్ పెట్టేందుకు ఏపీలో చట్టం
సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ఏపీలో ప్రత్యేక చట్టం అవసరం. గేమింగ్ బెట్టింగ్, క్రికెట్, ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్లను సైతం అరికట్టేలా బెట్టింగ్ యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. నేరస్తులు రోజు రోజుకు తెలివితేరిపోతున్నారు. సాక్షాలు దొరకకుండా తప్పులు చేసేది కొందరైతే, వాటిని వేరే వారిపై మోపేవారు మరికొందరు. మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ను ఉదాహరణగా పేర్కొన్నారు. నేరాలు నియంత్రణలో టెక్నాలజీ వినియోగం బాగా పెరగాలి. టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరాలను నియంత్రించాలి. అవసరమైతే కొన్ని సందర్భాలలో ప్రజల సహాయం తీసుకోవాలని’ ఉన్నతాధికారులకు చంద్రబాబు సూచించారు.
ఏపీలో తగ్గిన నేరాలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంతో పాటు నేరాల తగ్గుదలకు తాము ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘2014 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి కాలంలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే నేరాలు 17 శాతం తగ్గాయి. 75,500 సీసీటీవీలు ఏర్పాటు చేయడంతో పాటు 187 డ్రోన్లతో నిఘా పెంచాం. 2023 జూన్ నుంచి 2024 జనవరి నెల వరకూ మహిళలపై 18,114 నేరాలు జరిగాయి. అదే కూటమి ప్రభుత్వ హయాంలో 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకూ 16,809 నేరాలు జరిగాయి.
శక్తి యాప్ ద్వారా నిరంతరం రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో గంజాయి సాగును వేల ఎకరాల నుంచి వందల ఎకరాలకు వచ్చేలా చేయగలిగాం. త్వరలో పూర్తిగా బంద్ కానుంది. గంజాయి స్మగ్లింగ్ కేసులలో 2,911 మందిని అరెస్టు చేశాం. గంజాయి రహిత ఏపీగా మార్చుతాం’ అని డీజీపీ అన్నారు. నేరాల నియంత్రణతో ప్రజలకు భరోసా కల్పించాలని మీ ‘లాఠీ టూ డేటా’ను మరింత ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.






















