Story Of Guruvayur Temple: గురువాయూర్ కి ఆ పేరెలా వచ్చింది - ఇక్కడ బాలగోపాలుడి విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలుసా!
Guruvayur Temple:గురువాయూర్..కేరళలో ఉన్న పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఇదొకటి. ఈ క్షేత్రానికి ఈ పేరెలా వచ్చింది? ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఎంత ప్రత్యేకమో తెలుసా...
Interesting facts about Kerala Guruvayur Temple: కేరళలోని పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన గురువాయూరు త్రిసూర్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణాది ద్వారకగా పిలిచే ఈ ప్రదేశంలో శ్రీ కృష్ణుడు గురువాయురప్పన్ గా పూజలందుకుంటున్నాడు.
గురువాయూర్ అనే పేరెలా వచ్చింది!
ఇక్కడ బాలగోపాలుడి విగ్రహాన్ని ప్రతిష్టించింది దేవతల గురువైన బృహస్పతి - వాయుదేవుడు... బృహస్పతి పేరుమీద 'గురు' .. వాయుదేవుడి పేరుమీద 'వాయు'..ఇలా ఈ క్షేత్రానికి గురువు -వాయువు -ఊరు...గురువాయూరుగా స్థిరపడింది.
ఎన్నో చేతులు మారిన బాలగోపాలుడు!
బాలగోపాలుడి విగ్రహాన్ని మొదట..శివుడు, బ్రహ్మ ఆరాధించారని..ఆ తర్వాత...బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని సంతానం కోసం దీక్ష చేస్తున్న సూతపాశరుషికి ప్రసాదించాడు. అక్కడి నుంచి కశ్యప ప్రజాపతి దగ్గరకు.. ఆయన నుంచి వసుదేవుడికి(శ్రీ కృష్ణుడి కన్నతండ్రి) వద్దకు చేరింది. తండ్రి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకున్న శ్రీ కృష్ణుడు...అవతారం చాలించేముందు...తన భక్తుడైన ఉద్ధవుడిని పిలిచి...తన విగ్రహం సముద్రంలో తేలివస్తుందని..దానిని అనువైన ప్రదేశంలో ప్రతిష్టించమని చెప్పాడు. ఉద్ధవుడు ఆ బాధ్యతను దేవతల గురువైన బృహస్పతికి అప్పగించగా...వాయుదేవుడి సహకారంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్లాడు. మార్గమధ్యలో పరశురాముడి సూచన మేరకు గురువాయూరు ప్రాంతంలో ఓ కొలను దగ్గరు చేరుకున్నారు. అక్కడ తపస్సు చేస్తున్న పరమేశ్వరుడు..ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్టించమని చెప్పి..పార్వతీ సమేతంగా కోనేటికి ఎదురుగా ఉన్న మమ్మియూర్‌కు చేరుకున్నారు. ఈ ప్రదేశాన్ని రుద్రతీర్థం అని పిలుస్తున్నారు. బృహస్పతి - వాయుదేవుడి కోరిక మేరకు దేవతల వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ ఆలాయాన్ని నిర్మించగా...తదనంతర కాలంలో పాండ్యరాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
Also Read: నారసింహస్వామి ఆలయం ఉన్న ఊర్లో కాకులుండవా - ఇందులో నిజమెంత!
మృత్యువును జయించిన పాండ్యరాజు
ఓ జ్యోతిష్యుడు పాండ్యరాజుకి ప్రాణ గండం ఉందని...పాముకాటుతో చనిపోతాడని చెప్పాడు. ఇందుకు పరిహారంగా గురువాయూర్ వెళ్లి స్వామివారిని ప్రార్థించమని చెప్పాడు. అలా స్వామివారి దగ్గరకు చేరుకున్న పాండ్యరాజు...ఆ పాదాల దగ్గరే ధ్యానంలో ఉండిపోయాడు. అలా తన మృత్యుఘడియలు కూడా దాటిపోయాయి. అది గ్రహించి రాజభవనానికి వచ్చిన పాండ్యరాజు...పాముకాటుతో చనిపోతానని చెప్పారు కదా అని జ్యోతిష్యుడిని ప్రశ్నించగా పాదాలపై ఉన్న పాముకాటు గుర్తులు చూపిస్తాడు ఆ జ్యోతిష్యుడు. ఇదంతా స్వామివారి మహిమే అని భావించిన పాండ్యరాజు ... విశ్వకర్మ నిర్మించిన ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశాడు
బాలకృష్ణుడి లీలలెన్నో!
బాలకృష్ణుడి రూపంలో కొలువైన నారాయణుడు ఇక్కడ అర్చకులకి, తనను నమ్మిన భక్తులకు కలలో కనిపించి కష్టాలు తీర్చిన గాథలెన్నో ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రచారంలో ఉన్న కథలన్నీ ఒకెత్తు...నారాయణ భట్టాతిరి ... చిన్ని కృష్ణుడిని కీర్తిస్తూ రాసిన నారాయణీయం మరొకెత్తు. పదహారేళ్లకే వేదాలన ఔపోసన పట్టిన నారాయణ భట్టాతిరి 27 ఏళ్లకే పక్షవాతంతో మంచం పట్టాడు. ఎన్నో మందులు వినియోగించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు గురువాయూరప్ప పాదాల దగ్గరకు చేరుకున్నాడు...అప్పటికి ఆరోగ్యం కుదుటపడడంతో... శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడిని స్తుతిస్తూ నారాయణీయం రచించాడు. స్వామివారి సన్నిధిలో ఈ నారాయణీయం పఠిస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయంటారు పండితులు
Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!
పెళ్లి - అన్నప్రాసనలకు ఈ ఆలయం ప్రత్యేకం
తెల్లవారుజామునే మూడు గంటల సమయంలో ఆలయం తలుపులు తెరిచి నాదస్వరంతో బాలకృష్ణుడిని మేల్కొలుపుతారు. పాలు, కొబ్బరినీళ్లు, గులాబీ అత్తరు, గంధంతో అభిషేకం చేసి...స్వామివారిని అలంకరించి బెల్లం, నెయ్యి, బియ్యంపిండితో చేసిన వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం మూడుసార్లు ఊరేగింపు నిర్వహిస్తారు. ఇక్కడ అన్నప్రాసన చేస్తే పిల్లలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఆ బంధం కలకాలం సంతోషంగా కొనసాగుతుందని నమ్మకం. ఎక్కడా లేని మరో ప్రత్యేకత తులాభారం.. భక్తులు తమ బరువుకి సమానమైన పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు స్వామివారికి నివేదిస్తారు. ఇక్కడ గజరాజుల వైభవమే వేరు. స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవ్ అనే గజరాజుల గురించి ఎన్నో కథలు చెబుతారు. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా జరిగే ఏనుగుల పందాలు చూసేందుకు భక్తులు పోటెత్తుతారు.
పాంచజన్యం, సుదర్శనచక్రం, కౌముదికి, తామరపుష్పంతో దర్శనమిచ్చే బాలకృష్ణుడి రూపాన్ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు. భగవంతుడి సన్నిధికి చేరాలి అనుకునే భక్తులు..ఈ ముగ్ధమనోహర రూపాన్ని కళ్లారా దర్శించుకుంటే మోక్షం పొందొచ్చు. కేరళలోని త్రిస్సూర్ రైల్వేస్టేషన్ నుంచి గురువాయూర్ కి చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి సమీపంలో కోయంబత్తూర్, కొచ్చి విమానాశ్రయాలున్నాయి.
Also Read: నరకం అంటే ఏంటి - ఇక్కడకు ఎవరెళతారు!