(Source: Poll of Polls)
Spiritualty: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!
పాములకు రెండు నాలుకలుంటాయి..ఈ విషయం అందరకీ తెలిసిందే. అయితే పాములకు మాత్రమే 2 నాలుకలు ఎందుకుంటాయి? మొదట్లో ఒక నాలుకే ఉన్నప్పటికీ ఆ తర్వాత 2 నాలుకలు ఎలా అయ్యాయి...దీనివెనుకున్న పురాణగాథేంటి!
Why Do Snakes Have Forked Tongues: కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానం కోరుతాడు కశ్యప ప్రజాపతి. ఈ మేరకు కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు ఉత్పన్నమవుతాయి. కద్రువ అండాల నుంచి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా మొత్తం 1000 పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన అండాన్ని చిదిమేస్తుంది...అందులోంచి కాళ్లులేకుండా మొండెం మాత్రమే ఉండేవాడు జన్మిస్తారు. తనే అనూరుడు...అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం. అలా జన్మించిన అనూరుడు...తల్లి వినతతో..నువ్వు సవతిని చూసి నన్ను చిదిమేశావు అందుకే ఆమెకు దాసిగా ఉండు..రెండో అండాన్ని జాగ్ర్తతగా చూసుకో..తనే నిన్ను దాస్యం నుంచి విముక్తుడిని చేస్తాడని చెప్పి సూర్యుడి రథసారధిగా వెళ్లిపోతాడు అనూరుడు.
దాసిగా ఉండిపోయిన వినత
వినత, కద్రువలు ఓ రోజు సముద్రం ఒడ్డుకి వెళ్లినప్పుడు క్షీర సాగరమథనంలో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రాన్ని చూసిన కద్రువ తన సవతితో చూడు ఆ గుర్రం శరీరం తెల్లగా తోక నల్లగా ఉంది అంటుంది. కాదు కాదు గుర్రం తోక కూడా తెల్లగా ఉంది అంటుంది వినత. మర్నాడు వచ్చి చూద్దామని ఇద్దరూ పందెం వేసుకుంటారు...తోక తెల్లగా ఉంటే నీకు నేను దాస్యం చేస్తాను లేదంటే నువ్వు నాకు దాసిగా ఉండాలంటుంది. సరే అనుకుని ఇద్దరూ వెళ్లిపోతారు. కద్రువ తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి తోక నల్లగా ఉండేట్టు చేయమంటుంది. అది సరికాదని కొడుకులు అంగీకరించకపోవడంతో కోపంతో ...మీరు జనమేజయుడు చేసే యాగంలో మరణిస్తారని శాపం ఇస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత రోజు వినత, కద్రువ వెళ్లి చూడగా గుర్రం తోక నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత..దాస్యం చేసేందుకు అంగీకరిస్తుంది
గరుత్ముంతుడి పుట్టుక
కొన్ని రోజులకు వినతకు గరుత్మంతుడు జన్మిస్తాడు. గరుడుడిని చూసిన కద్రువ...వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అంటుంది. అలా గరుత్మంతుడు కూడా తన సవతి తమ్ముళ్లను ఎత్తుకుని తిప్పుతూ ఉండేవాడు. ఓ రోజు గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లగా ఆ వేడికి సర్పాలు మాడిపోతుంటాయి...ఆ సమయంలో కత్రువ ఇంద్రుడిని ప్రార్థించి వాన కురిపించి..గరుడుడిని దూషిస్తుంది. ఆ క్షణం బాధపడిన గరుడుడు తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించాలని నిర్ణయించుకుని...అందుకోసం ఏం చేయాలని సవతి తల్లిని అడుగుతాడు. అప్పుడు కద్రువ... అమృతం తెచ్చి ఇస్తే దాస్యం నుంచి నీ తల్లికి విముక్తి కలిగిస్తానంటుంది.
తల్లికి దాస్యం నుంచి విముక్తి
గరుత్మంతుడు అమృతం తీసుకుని వెళుతుండగా మార్గ మధ్యలో ఇంద్రుడు కనిపించి..అందరకీ అమరత్వం తగదని అడ్డుకుంటాడు. ఆ మాటలు అంగీకరించిన గరుడుడు...ఇంద్రుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు. తన తల్లి దాస్య విముక్తి కోసం అమృతం తీసుకెళుతున్నానని చెప్పి తన వంతుగా వాళ్ల చేతిలో అమృత కలశం పెడతాను మీరు వెంటనే తీసుకెళ్లిపోండి అని చెబుతాడు. అలా అమృత కలశాన్ని తీసుకెళ్లి తన సవతి సోదరులకు చూపించి దర్భలపై పెడతాడు. ఆ వెంటనే వినతకు దాస్యం నుంచి విముక్తి లభిస్తుంది. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా వెళ్లిపోతాడు...
పాములకు రెండు నాలుకలకు కారణం ఇదే
అమృత కలశం చూసిన తర్వాత దాన్ని సేవించడానికి ముందు పవిత్రులవ్వాలని భావించి పాములన్నీ స్నానమాచరించేందుకు వెళ్లాయి. అదే తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని ఎత్తుకుపోతాడు. తిరిగి వచ్చిన సర్పాలు జరిగింది గ్రహించి.. కనీసం ఆ కలశం పెట్టిన దగ్గర ఏమైనా ఒలికిందేమో అనే ఆలోచనతో దర్భలని నాకుతాయి..దర్భ చాలా పదునుగా ఉండడం వల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోతాయి. అప్పటి నుంచి పాములకు రెండునాలుకలు శాశ్వతం అయిపోయాయి.