Karthika Puranam Day-4: కార్తీక మహాపురాణం కథ DAY-4: కార్తీకమాసంలో దీపారాధనతో మోక్షం ఎలా సాధ్యం!
Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యాన్ని వివరించేలా ఈ కథలుంటాయి.

కార్తీక పురాణం నాల్గవ అధ్యాయం
బ్రహ్మర్షీ! మీరు ఇంతవరకూ కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పారు..ఏ సంకల్పంతో వ్రతాన్ని ఆచరించాలో కూడా చెప్పమని అడిగారు జనకమహారాజు
వశిష్ట ఉవాచ
అన్ని పాపాలనూ హరించే కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది ఉండదు. వేకువజామునే స్నానం..శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో దీపం వెలిగించడం అత్యంతపుణ్యఫలం. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో , విప్ప నారింజ నూనెలతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులౌతారు. కాంక్షతో , నలుగురి మధ్య గొప్పకోసం దీపదానం చేసినా పుణ్యమే.
దీపారాధన మహిమ
పూర్వం పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలున్నా సంతానం లేక కుంగిపోయి తపస్సు చేశారు. అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని ఓ రాజా! ఈ మాత్రం కోరికకు తపస్సు ఎందుకు కార్తీకమాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి, బ్రాహ్మణులను దీప దానాన్ని ఇవ్వమని చెప్పారు. అలా రుషి చెప్పినట్టు ఆ రాజు..కార్తీక వ్రతం ఆచరించి, శివప్రీతికై బ్రాహ్మణులకు దీప దానం చేశాడు. ఆ ఫలితంగా ఆ దంపతులకు కుమారుడు జన్మించాడు. శత్రుజిత్తు అనే పేరు పెట్టారు. శత్రుజిత్తు వీరుడిగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు కానీ వేశ్యా లోలుడై విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు. ఓ రోజు సౌందర్యరాశి అయిన ఓ విప్రుడి భార్యను చూసి మోహించాడు. ఆమె కూడా యువరాజుపై మోజుపడింది. ఓ రోజు ఆమె భర్తకు ఈ విషయం తెలిసింది. ఇద్దరూ కలసి ఉండగా చంపాలనుకుని అనుసరించాడు. ఆ రోజు కార్తీక సోమవారం..పౌర్ణమి కూడా కలసివచ్చింది. యువరాజు విప్రుని భార్య ఇద్దరూ ఓ పాడుబడిన శివాలయానికి చేరుకున్నారు. పాడుబడిన ఆలయంకావడంతో చిన్న వెలుగుకోసం ఆ విప్రుడి భార్య తన చీర కొంగు చింపి వత్తిచేసింది..యువరాజు తనతోపాటూ తీసుకొచ్చిన ఆముదాన్ని పోసి దీపంగా వెలిగించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఉన్న సమయంలో ఆ విప్రుడు వచ్చి వాళ్లను చంపేసి..తన ప్రాణం కూడా తీసుకున్నాడు. యమదూతలు శివదూతలు ఇద్దరూ వచ్చారు. యువరాజును, బ్రాహ్మణుడి భార్యను కైలాశానికి తీసుకెళుతుంటే... ఆ విప్రుడిని మాత్రం యమదూతలు తీసుకెళ్లారు. పాపం చేసినవారికి కైలాశం..నాకు నరకమా? అని ప్రశ్నించాడు ఆ బ్రాహ్మణుడు. వీళ్లు ఎంత పాపాత్ములు అయినా కార్తీకపౌర్ణమి, సోమవారం శివాలయంలో దీపం వెలిగించారు. అందుకే పాపాలు తొలగిపోయాయి. అలాంటి సమయంలో వీరిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావు అని చెప్పారు. ఇదంతా విన్న యువరాజు శత్రుజిత్తు..దోషం చేసిన మాకు కైవల్యాన్ని ఇచ్చిన ఆ బ్రాహ్మణుడిని నరకానికి పంపించడం భావ్యం కాదన్నాడు. దీపం వెలిగించగా వచ్చిన పుణ్యాన్ని ధారపోసి తనని కూడా కైలాశానికి తీసుకెళ్లారు.
ఓ జనకమహారాజా! కార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయంలో గానీ, విష్ణుఆలయంలో గానీ దీపారాధన చేయాలి. నెల రోజులూ చేసినవాళ్లు మోక్షాన్ని పొందుతారు. కనీసం పౌర్ణమి రోజు అయినా దీపం వెలిగించాలి. నువ్వు నెలపొడవునా శివాలయంలో దీపారాధన చేయి మహారాజా అని చెప్పారు వశిష్ట మహర్షి
కార్తీకపురాణం నాలుగో అధ్యాయం సంపూర్ణం
గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
( రోజుకో కథ చదువుకుంటే మంచిది..ముందు రోజు కథ చదువుకోవడానికి ఆటంకం వస్తే.. ఆ తర్వాత రోజు అన్ని కథలు కలిపి చదువుకోవచ్చు)






















