Local Boi Nani Arrest: లోకల్ బాయ్ నాని అరెస్టు, బీ కేర్‌ఫుల్ అంటూ ఇన్‌ఫ్లూయెన్సర్లకు సైబర్ పోలీసుల వార్నింగ్
Social Media online Betting apps | సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ప్రభావితం చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Vizag Youtuber Local Boi Nani promoting Online betting apps | ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వాసుపల్లి నాని @ లోకల్ బాయ్ నాని అరెస్టయ్యాడు. యూట్యూబ్ ,ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సొంత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టించి వారిని ఆన్‌లైన్ బెట్టింగ్ లో పాల్గొనేట్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయేటట్టు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని విశాఖలోని కంచరవీధికి చెందిన లోకల్ బాయ్ నాని ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
కేసు వివరాల్లోకి వెళితే..
విశాఖకు చెందిన ఒక బాధితుడు సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ప్రచారం చేయడం ద్వారా ప్రభావితం అయ్యి DAFABET, MAHADEVBOOK, PARIMATCH, RAJABET వంటి యాప్స్ లో బెట్టింగ్ ఆడి నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో ఇబ్బంది పడ్డాడు. ఇటీవల లోకల్ బాయ్ నాని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించవచ్చని ఆ వీడియోను రూపొందించాడు. ఇలాంటి ప్రచారాలతో యువత బెట్టింగ్లో పాల్గొని అప్పులపాలవడంతో పాటు తమ భవిష్యత్తును పాడు చేసుకుని అవకాశం ఉందని లోకల్ నానిపై చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 21న ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాలు సేకరించి, లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. మరి కొంత మంది సోషల్ మీడియా influencers కూడా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నానిని శనివారం అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచారు. మేజిస్ట్రేట్ ఆదేశాలు మేరకు యూట్యూబర్ నానిని రిమాండ్కు పంపించారు.
సజ్జనార్‌కు క్షమాపణ చెప్పిన నాని
యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఓ వీడియో చేశాడు. స్థానికంగా ఉండే ఓ మహిళ 30 వేలు అడుగుతుంది. లోకల్ నాని నలభై వేలు ఇస్తాడు. 30వేలు అడిగితే 40వేలు ఇవ్వడమేంటని ఆమె ఆశ్చర్యపోయి, ఎలా వస్తున్నాయని అడుగుతుంది. ఓ ప్లాట్‌ఫామ్‌లో గేమ్స్ ఆడుతూ సంపాదిస్తున్నాననీ, చాలా మందికి సలహాలు ఇస్తున్నానంటూ నాని చెప్పుకొస్తాడు. ఇప్పుడు కావాల్సినంత డబ్బు వస్తుందని అంటాడు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ లోకల్‌బాయ్ నానికి వార్నింగ్ ఇచ్చారు. డబ్బులు వస్తాయని ఆశతో మీరు చేసే ప్రమోషన్‌తో యువత తప్పుడు మార్గం పడుతున్నారని... కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను చదువుకోలేదని, భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని అన్నాడు. డబ్బులు వస్తాయంటే ఏదో తెలియక చేశానని, ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదని నాని వీడియో రిలీజ్ చేశాడు. యూట్యూబర్ నాని వీడియోపై సజ్జనార్ మళ్లీ స్పందించారు. తప్పు తెలుసుకున్నావు, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకపోవడం మంచిదని హితవు పలికారు.
బెట్టింగ్ సమాచారం అందించడానికి నెంబర్
ఎవరైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆన్ లైన్ బెట్టింగ్లో పాల్గొనేటట్టు చేసే విధంగా ఎవరైనా వీడియోలు ప్రమోట్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడుతున్న బుకీలు , బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే కమిషనర్ పోలీస్ కార్యాలయానికి ఈ నెంబర్ 7995095799 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read: Local Boy Nani Latest News: చదువుకోని కారణంగా తప్పు చేశాను, సజ్జనార్‌కు క్షమాపణ చెప్పిన నాని






















