Ind vs Pak Head to Head Records | Champions Trophy 2025 భారత్ వర్సెస్ పాక్...పూనకాలు లోడింగ్ | ABP
2017 ఛాంపియన్స్ ట్రోఫీ. టీమిండియా క్రికెట్ ఆడినంత కాలం గుర్తు పెట్టుకునే ఓటమి అది. లీగ్ స్టేజ్ లో పాక్ ను చావ బాది చెవులు మూసిన మనం ఫైనల్లో మాత్రం ఊహించని రీతిలో కంగు తిన్నాం. అప్పుడు లండన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మన ముందు ఏకంగా 339పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. కానీ టీమిండియా మాత్రం ఘోరంగా విఫలమైన 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితం తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది పాకిస్థాన్. ఐసీసీ టోర్నమెంటుల్లో భారత్ అంటే చాలు ఓటమి ఫిక్స్ అయిపోయే పాకిస్థాన్ కి ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం ఎప్పుడూ ఓ మినహాయింపే. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ మీద విజయం కోసం మనం 2013 దాకా వేచి చూడాల్సి వచ్చింది మరి. 2004, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లో భారత్ పై విక్టరీ నమోదు చేసి కాలర్ ఎగరేసింది పాకిస్థాన్. అయితే దాయాది గర్వమణిగేలా మనం 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో చుక్కలు చూపించాం. కానీ 2017లో మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని షాకిచ్చి ఫైనల్లో టీమిండియాను ఓడించింది పాక్. ఆ తర్వాత మనం 2022 టీ 20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను ఓడించినా...ఛాంపియన్స్ ట్రోఫీ పరాభవం మాత్రం ఇంకా అలాగే మిగిలి ఉంది. కారణం ఏంటంటే ఆ తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్నాళ తర్వాత ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే న్యూజిలాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది పాకిస్థాన్. సో వాళ్లకు ఇది చావో రేవో మ్యాచ్. గెలిస్తే కానీ లీగ్ స్టేజ్ దాటలేరు. న్యూజిలాండ్, టీమిండియాల నుంచి బలమైన పోటీ ఉంటుంది వాళ్లకు. మరో వైపు ఫకార్ జమాన్ టీమ్ లో లేకపోవటం...బాబర్ ఆజమ్ ఫామ్ లో లేకపోవటంతో పాకిస్థాన్ ను కలవర పెడుతోంది. మనకు బుమ్రా లేకపోయినా...ఐదు వికెట్లు తీసిన పేస్ లెజెండ్ షమీ నేనున్నానంటూ అభయమిస్తున్నాడు. సెంచరీ వీరుడు గిల్, పాక్ అంటే రెచ్చిపోయే కింగ్ విరాట్ కొహ్లీ..కెప్టెన్ రోహిత్ శర్మ మరో సారి విరుచుకపడితే పాక్ కి పరాభవం తప్పదు అనేది విశ్లేషకుల మాట. టీమ్ ల పరంగా చూసుకుంటే 3-3 రికార్డుతో సమానంగా ఉన్న ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ముందడుగు వేయాలంటే కీలకమైన ఈ మ్యాచ్ లో గెలవాలనే తపనతో ఉంటాయి. ప్రధానంగా భారత్ రణమా శరణమా అంటూ బరిలోకి దిగటం ఖాయం. లెక్క సరిచేయటం ఖాయమని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు.





















