Maha Shivaratri 2025: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
Arunachalam and Varanasi: అత్యంత తేలికగా మోక్షం లభించే మార్గం చూపించండి అని మహర్షులంతా కలసి త్రిమూర్తులను అడిగారు. వారు చూపించిన మార్గం కష్టంగా తోచింది. అందుకే ఆ మార్గాన్ని మహర్షులే ఎంచుకున్నారు.

Spiritual Significance of Arunachalam and Varanasi: మోక్షం కోసం మహర్షులు ఎంచుకున్న రెండు మోక్ష మార్గాలు ఏంటంటే
మొదటిది మహా శ్మశానం - వారణాసి
రెండోది మనో శ్మశానం - అరుణాచలం
వారణాసిలో మరణిస్తే శివసాయుజ్యం లభిస్తుందంటారు..అయితే అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటే చాలు మోక్షం సిద్ధిస్తుంది. అందుకే వేలకోట్ల ఆస్తులు వదిలేసి ఈ క్షేత్రాల్లో శేష జీవితాన్ని గడుపుతున్నవారెందరో ఉన్నారు.
ఈ రెండు క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం తప్పకుండా ఉండాలి.
శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అయిన అరుణాచలం వెళితే ..అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి మౌనంగా ఉండండి. శివనామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ చేయండి. ఫోన్లు మాట్లాడాలి అనే ఆలోచన చేయవద్దు. మనసు పూర్తిగా శివుడిపై లగ్నం చేయండి. దంపతులు కలసి వెళితే మనసులో మరో ఆలోచన రానివ్వవద్దు. అక్కడ మీరంతా కేవలం భక్తులు మాత్రమే.. భార్య భర్త కాదు అనేలా ఉండాలి. ఎందుకంటే కోరికలను దగ్ధం చేయమని అరుణాచలేశ్వరుడి సన్నిధికి వెళ్లి అడిగే మీరు.. అక్కడ కోర్కెలు తీర్చుకోవడం అంటే అంతకన్నా మహాపాపం మరొకటి ఉండదు.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎవరినీ దూషించవద్దు. ఎందుకంటే అక్కడ శివ పార్వతులు సిద్ధుల రూపంలో సంచరిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే మనసా వాచా కర్మణా శివ స్పృహతో చేయాల్సిన యాత్ర ఇది. అరుణాచలంలో ప్రవేశించడమే అదృష్టం అనుకుంటే.. పంచాక్షరి స్మరిస్తూ నియమ నిష్టలతో గిరి ప్రదక్షిణ చేయడం అనేది జన్మకు సరిపడా గుర్తుంచుకోదగిన మహా ఘట్టం అవుతుంది.
కేవలం గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది కొండ కాదు. కొండరూపంలో కొలువైన దక్షిణామూర్తి. శివుడు గురు స్వరూపంగా మారితే ఆ రూపమే దక్షిణామూర్తి. భగవంతుడు కూడా తీర్చలేని సమస్యలను గురువు తీర్చగలడు, మోక్షానికి మార్గం చూపగలడు..అందుకే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ అంటే గురువు చుట్టూ తిరిగినట్టే. అ స్వరూపంలోనే శివుడితో పాటూ పార్వతి, వినాయకుడు, నంది కూడా కనిపిస్తారు. అందుకే గిరి ప్రదక్షిణను విహార యాత్రలా కాదు..గర్భగుడిలో భగవంతుడికి చేసే ప్రదక్షిణలా ఉండాలి.
కాశీ విషయానికొస్తే..భూమిపై ఉన్న సప్త మోక్షదాయక క్షేత్రాల్లో కాశి ఒకటి, 12 జోతిర్లింగాల్లో శ్రేష్ఠమైనది. 14 భువన భాండాల్లో విశేషమైన స్థలం వారణాసి. ఈ క్షేత్రం బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు..శ్రీ మహావిష్ణువు హృదయం నుంచి వెలువడినది. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు నిర్మించిన ఆధ్యాత్మిక రాజధాని..స్వయంగా శివుడు కొలువై ఉండే పట్టణం.
Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!
ప్రపంచం నీట మునిగినా కాశీ క్షేత్రం అలాగే ఉంటుందంటారు. భూమి ముందా కాశీ ముందా అని అడిగితే మొదట తన త్రిశూలంపై కాశీని సృష్టించిన తర్వాతే శివుడు భూమిని సృష్టించాడని శివపురాణంలో ఉంది.
ఈ క్షేత్రంలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనం చేసుకోవడం ప్రధానం.
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ కాల భైరవుడు కాశీ క్షేత్రంలోకి అనుమతించడు. ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ ఉండదు. అందుకే ఇక్కడ మరణించలేకపోయినా వారి అస్థికలు తీసుకొచ్చి కాశీలో కలుపుతారు. ఈ క్షేత్రంలో ప్రవేశానికి శివానుగ్రహం ఉండాలని చెబుతారు.
Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

