Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!
సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు కొలువైన క్షేత్రం పూరీ. ఏటా ఆషాఢ శుక్ల విదియనాడు జరిగే రథయాత్రపై ఇక్కడ చాలాప్రత్యేకం. ఈ రథయాత్ర గురించి మీరు తెలసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే...
పూరీ జగన్నాథుడి రథయాత్ర
ప్రాగ్ద్వారే జగన్నాథంచైవ దక్షిణే సేతసముద్రః,
పశ్చిమే ద్వారకాంచైవ ఉత్తరేషు బదరికావనః!
ఏవం భారతావని దర్శనం కుర్యాత్ ,
జన్మే మోక్షదాయకః
తూర్పువైపు జగన్నాథ క్షేత్రం(పూరీ), దక్షిణానికి రామేశ్వరం, పశ్చిమానికి ద్వారక, ఉత్తరానికి బదరికా వనం.. ఈ నాలుగు దర్శించుకుంటే అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించినంత ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఈ నాలుగు భారతదేశానికి నలువైపులా ఉన్న ద్వారాలు.
పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు. ఈ రథయాత్రకి సంబంధించి చాలా విశేషాలున్నాయి
- ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది.
- ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో అలాకాదు! సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు.
- ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలు తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలుపెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అనీ బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని తాళధ్వజం అనీ సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని దేవదాలన అనీ పిలుస్తారు.
- ఈ రథాలని తయారుచేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి. దానికి ఎన్ని చక్రాలు ఉండాలి. ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలిలాంటి లెక్కల్ని తూచాతప్పకుండా పాటించాలి. రథాన్ని తయారుచేసేందుకు ఎన్ని చెక్కముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది.
- ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు. కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు, జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురతో ఊడుస్తాడు.
- మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండిచా అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరీ ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ తొమ్మిదిరోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు. తిరిగి ఆషాఢమాసంలోని పదోరోజున పూరీ గుడికి చేరుకుంటాడు.
- మన దగ్గర రాములవారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారీ వర్షం పడటం ఓ విశేషం.
- జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్లడం ఇష్టం ఉండదేమో! అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటలపాటు కొన్ని వేలమంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు.
- జగన్నాథుడు గుండిచా ఆలయం నుంచి తిరిగివచ్చే యాత్రని ‘బహుద యాత్ర’ అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ ‘మౌసీ మా’ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయల్దేరతాయి.
- జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతురన్నమాట! దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు.
Also Read: జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!