Jagannath Rath Yatra 2022 : జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!
Jagannath Rath Yatra 2022 : ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో పూరీ ఒకటి. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు. ఏటా ఆషాఢ శుక్ల విదియనాడు జరిగే రథయాత్రపై ఇక్కడ చాలాప్రత్యేకం..
జూలై 1 న పూరీ జగన్నాథుడి రథయాత్ర
అయోధ్యా మధురా మాయా
కాశీ కాంచీ అవంతికా
పూరీ ద్వారావతీచైవ
సప్తైతే మోక్షదాయకా!!
పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు.
Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!
పూరీ విగ్రహాల వెనుక పురాణగాథ
అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను...విద్యాపతి ప్రేమ వివాహం చేసుకుంటాడు. జగన్నాథుడి విగ్రహాన్ని చూపించాలని మావగారైన విశ్వావసుడిని పదేపదే అడుగుతాడు విద్యాపతి. అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ గిరిజనరాజు...కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. తెలివిగా వ్యవహరించిన విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. ఈ మేరకు రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప దుంగలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు.
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
విగ్రహాలు సగమే ఎందుకుంటాయి
కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో రాచమందిరానికి చేరుకుంటాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. అందుకు అంగీకరించిన రాజు అటుగా ఎవ్వరూ వెళ్లకూడదని భటులను ఆదేశిస్తారు. రోజులు గడుస్తున్నా విశ్వకర్మ గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. లోపల శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.
రథయాత్ర చూడాలంటే రెండు కళ్లు సరిపోవు
ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు కళ్లు చాలవు. రథాయాత్ర సమయంలో ఉత్సవమూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకొచ్చి రత్నపీఠంపై అలంకరిస్తారు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు రథంపై సిద్ధంగా ఉన్న ఉత్సవమూర్తులకు…పూరీ సంస్థానాధీశులు నమస్కరించి…స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. అంతరం జగన్నాథ రథచక్రాలు కదులుతాయి.