GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP Desam
రెండు సమ ఉజ్జీలుగా ఉన్న జట్లంటే రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ అని చెప్పొచ్చు. మొదటి మ్యాచ్ ఓడిపోయినా తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్న గుజరాత్ టైటాన్స్..రెండు ఓటములు తర్వాత రెండు విజయాలు సాధించి కాన్ఫిడెన్స్ తెచ్చుకున్న రాజస్థాన్ రాయల్స్ తలపడిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్ ను అయితే బాగా ఎంటర్ టైన్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ పై 58పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. సూపర్ స్టార్ సాయి సుదర్శన్
గడచిన రెండేళ్లుగా సాయి సుదర్శన్ ఆడుతున్న తీరు చూస్తుంటే టీమిండియాకు ఓ కొత్త సూపర్ స్టార్ దొరికాడు అనిపిస్తోంది. ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా సాయి సుదర్శన్ విరుచుకపడుతున్న తీరు అద్భుతం అనే మాట కంటే ఎక్కువ. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ కు గిల్ వికెట్ తీసిన ఆనందాన్ని ఎంతో సేపు మిగల్చ లేదు సాయి సుదర్శన్. ముందు జోస్ బట్లర్ తో తర్వాత షారూఖ్ ఖాన్ తో కలిసి RR ను రఫ్పాడించాడు. 32 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి..మొత్తంగా 53 బాల్స్ ఆడి 8 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 82పరుగులు చేసి దేశ్ పాండే బౌలింగ్ లో కీపర్ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి అవుటైపోయాడు. ఈ సీజన్ లో మూడోహాఫ్ సెంచరీ బాది తన టీమ్ 217పరుగులు స్కోర్ చేయటంలో కీలక పాత్ర పోషించాడు.
2. బట్లర్ & షారూఖ్ షో
జోస్ బట్లర్ అండ్ షారూఖ్ ఖాన్ ఇద్దరూ కూడా 36 పరుగులే చేశారు బట్ అవి చాలా వ్యాల్యుబుల్ అయ్యాయి జీటీకి. బట్లర్ 25 బాల్స్ లో 5 ఫోర్లతో 36 పరుగులు చేస్తే..షారూఖ్ ఖాన్ 20 బాల్స్ లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. చివర్లో రాహుల్ తెవాటియా..రషీధ్ ఖాన్ ఫైర్ వర్క్స్ ఓపెన్ చేయటంతో గుజరాత్ 6 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసి రాజస్థాన్ కు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
3. తుషార్, తీక్షణ హాఫ్ సెంచరీలు
రాజస్థాన్ తరపున ఇద్దరు బౌలర్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు. అయితే బ్యాటింగ్ లో కాదు బౌలింగ్ లో. ఎస్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే ఇద్దరూ కూడా 4 ఓవర్లలో 54, 53 పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీశారు. తుషార్ దేశ్ పాండే సూపర్ ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ , చివర్లో నో లుక్ షాట్స్ ఆడిన రషీద్ ఖాన్ వికెట్లు తీస్తే...తీక్షణ జోస్ బట్లర్, షారూఖ్ ఖాన్ వికెట్లు తీశాడు. కానీ ఈ ప్రోసెస్ లో ధారాళంగానూ పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరూ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కే ఆడటం మరో విశేషం
4. కెప్టెన్ సంజూ పోరాటం
218 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ జైశ్వాల్, వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రానా ఇలా వచ్చి అలా వెళ్లారు. అలాంటి టైమ్ లో పరాగ్ తో కలిసి పోరాడాడు సంజూ. మంచి బంతులను ఆపుతూనే చెత్త బంతులను బౌండరీలకు పంపాడు. అలా 28 బాల్స్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 41పరుగులు చేసిన సంజూ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అయిపోవటమే RR ఛేజింగ్ కు మోకాలడ్డింది.
5. సరిపోని హెట్మెయర్ పోరాటం
సంజూకు తోడుగా పరాగ్ కూడా రఫ్పాడించాడు 14 బాల్స్ లోనే ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసిన తర్వాత వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు పరాగ్. అయితే అక్కడితో RR పోరాటం ముగిసిపోలేదు. వెస్టండీస్ వీరుడు షిమ్రోన్ హెట్మెయర్ 32 బాల్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52పరుగులు చేశాడు. హెట్మెయర్ ఉన్నతం సేపు RR విన్నింగ్ మీద హోప్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రసిద్ధ్ కృష్ణ హెట్మెయిర్ వికెట్ను తీసుకున్నాడో అక్కడే ఖతం అయిపోయింది రాజస్థాన్ పోరాటం. గుజరాత్ బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి సంజూ, హెట్మెయిర్, ఆర్చర్ లను అవుట్ చేసి మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా గుజరాత్ 58పరుగుల తేడాతో రాజస్థాన్ ను ఓడించగలిగింది.
ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు వరుసగా ఇది నాలుగో విక్టరీ కాగా పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్ కి వెళ్లిపోయింది జీటీ. సీజన్ లో రెండు విజయాల తర్వాత మళ్లీ ఇవాళ ఓడిన రాజస్థాన్ మూడు అపజయాలతో ఏడో స్థానంలో ఉంది.






















