Vellore Golden Temple :ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
వంద ఎకరాల విస్తీర్ణం, 1500 కిలోల బంగారం,400 మంది శిల్పులు,ఆరేళ్ల నిరంతర శ్రమ, అద్భుతమైన శిల్ప చాతుర్యం, సుమారు 600 కోట్ల రూపాయల వ్యయం...అమృత్ సర్ స్వర్ణదేవాలయం గురించే అనుకుంటే పొరపాటే...
తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం ఇది. వాస్తవానికి స్వర్ణదేవాలయం అనే మాట వినగానే అమృత్‌సర్ గుర్తుకొస్తుంది కానీ ఆ ఖ్యాతి శ్రీపురానికీ దక్కుతుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలూ , శిల్పాలను మొదట రాగి తాపడం చేసి ఆతర్వాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి శిల్పాలు తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్‌తోనే రూపొందించి,బంగారు తొడుగుతో అలంకరించారు.
Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే
చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపంలో ఉంది ఈ ఆలయం. ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలైకోడిగా ప్రసిద్ధి చెందినా...మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు. ఆలయాన్ని చేరుకోవాలంటే కిలోమీటరున్నర దూరం నక్షత్రపు ఆకారంలో ఉన్న మార్గం గుండా వెళ్లాలి. ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్, బైబిలులోని ప్రవచనాలను రాశారు.తన దగ్గరకు చేరుకునేలోగా అజ్ఞానాన్ని వీడాలన్నది అమ్మ ఉద్దేశం.
ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం, కృత్రిమ ఫౌంటెన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన ఏడు జన్మల్నీ దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు.
మూలస్థానంలో...
వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామరపై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిల్చుని అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించి, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
అందరికీ ఒకటే దారి
మిగిలిన ఆలయాల్లోలాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులూ విభాగాలూ లేవు. అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే.
ఆలయ సందర్శనం ముగించుకుని బయటకు వచ్చే సరికి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం, గోడలపై కనిపించే మతగ్రంథాల బోధనలు భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.
రోజూ ఉదయం 5 గంటల నుంచి ఏడున్నర వరకూ అమ్మవారికి అభిషేకం, అలంకారం, హారతి ఉంటాయి. ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలకు అనుమతించరు. ఉదయం 7.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరచి ఉంచుతారు.
నారాయణి అమ్మ ఎవరు-ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు
నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తిఅమ్మ. ఈయన అసలు పేరు సతీశ్‌కుమార్. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్ ఒకమిల్లు కార్మికుడు, తల్లి టీచర్. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్ చిన్నప్పటి నుంచీ గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు.16వ ఏట శక్తిఅమ్మగా పేరుమార్చుకుని 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఆ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, సేవాకార్యక్రమాలు చేపట్టారు. అమెరికా, కెనడా దేశాల్లోనూ ఫౌండేషన్లు ఉన్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశీ భక్తులు ఇచ్చినవే.
Also Read: సాష్టాంగ నమస్కారం స్త్రీలు ఎందుకు చేయకూడదు
తిరుపతికి వెళ్లేవారిలో దాదాపు సగం మంది ఈ లక్ష్మీ నారాయణి అమ్మవారిని తప్పక సందర్శిస్తూ ఉంటారు. చిత్తూరు నుంచి దాదాపు 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా బాగుంటుంది. ఇక తిరుపతి నుంచి 134 కిలోమీటర్ల దూరంలో ఉన్నీ ఈ దేవాలయానికి దగ్గర్లో కాట్పాడి రైల్వే స్టేషన్ ఉంది.