Deeparadhana: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే
నిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారికి ఎన్నో సందేహాలు.ఎలాంటి ప్రమిదలో దీపం పెట్టాలి,ముందు వత్తి వేయాలా-నూనె పోయాలా, ఎన్ని వత్తులు వేయాలి, దీపాన్ని ఏదిశగా పెట్టాలనే ఎన్నో సందేహాలు..వాటికి సమాధానమే ఈ కథనం
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం అన్నమాట. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం దీపం నైవేద్యం పెట్టినా చాలు ఆ దేవదేవుడి అనుగ్రహం ఉంటుంది.
Also Read: అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా
దీపం ఏ దిశకు పెట్టాలి
- దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి.
- బొడ్డుత్తులైతే ఏ సమస్య ఉండదు.
- దీపపు సెమ్మలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- రెండు దీపాలు పెడితే ఒకదానిని మరొకటి చూసే విధంగా పెట్టాలి.
- ఒక్కటే పెడితే తూర్పు లేదా ఉత్తరం లేదా పశ్చిమం చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.
- తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతిబాధలు, గ్రహ బాధలు, ధు:ఖాలు తొలగిపోతాయి.
- పడమటి వైపు ముఖందీపం వెలిగిస్తే ఋణ బాధలు తొలగిపోతాయి, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది
- ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సరిసంపదలు కలుగుతాయి. విద్యకు, వివాహానికి అటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
- దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై, దు:ఖబాధలు కలుగుతాయి.
- నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం
ఎన్ని వత్తులు వేయాలి
ఎన్ని వత్తులు వేయాలి అనేదానికి పెద్ద పట్టింపులు లేవు కానీ ఒక్కటి కాకుండా ఎన్ని వేసినా మంచిదే అంటారు పెద్దలు. మంత్రం ప్రకారం చూస్తే
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంటి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని అర్థం.
Also Read: శరీరంలో ఏడు చక్రాలకి - తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం
దీపారాధన పద్ధతులు
- దీపారాధన చేసేముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి.
- వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను రోజూ శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి.
- శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు.
- ఏ ప్రమిదలో దీపారాధన చేసినా, ఆ ప్రమిద కింద చిన్న పళ్లేన్ని లేదా ఆకుని ఉంచాలి.
- మూడు వత్తులతో దీపారాధన చేయడం వలన సంతాన లాభం కలుగుతుంది.
- అయిదు వత్తులతో దీపారాధన చేయడం వలన సంపదలు చేకూరతాయి.
- తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
- అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. ఏకహారతి వినియోగించాలి
- అగరొత్తులు, ఏకహారతి, కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు.
ఇక దీపారాధనకు ఆవునెయ్యి శ్రేష్ఠం, అదీకాకపోతే నువ్వుల నూనె, ఇప్పనూనె, కొబ్బరినూనె, కుసుమనూనె తో కూడా వెలిగించవచ్చు. భక్తి శ్రద్ధలు ముఖ్యం అన్న విషయం గుర్తుంచుకుంటే చాలు. వీటిని ఎంతవరకూ పటించాలన్నది మీ భక్తివిశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.