Viral Video: బీరు బాటిల్‌తో తల పగులకొట్టుకుని రక్తంతో మహేష్‌బాబు ఫ్లెక్సీకి వీరతిలకం.. వీడియో వైరల్
బిజినెస్ మెన్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అమలాపురంలో ఓ థియేటర్ వద్ద ఓ వీరాభిమాని చేసిన పనికి అంతా ముక్కున వేలేసుకునేలా చేసింది..

అమలాపురం: సినిమా హీరోలంటే అభిమానించని వారుండరు.. కానీ కొంత మంది తమ అభిమానాన్ని పీక్స్‌లో చూపిస్తుంటారు.. ఫ్లెక్సీలు కట్టడం, బాణాసంచాలు కాల్చడం, థియేటర్ల వద్ద నానా హంగామా సృష్టించడం. రక్త దానాలు చేయడం ఇలా చాలా విధాలుగా తమ అభిమాన హీరోపట్లా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు.. అయితే అది ఒక్కో సారి హద్దులు మీరి ప్రవర్తించేలా వారి వ్యవహార శైలి ఉంటుంది. వీరి అభిమానం తగలెయ్య అంటూ చాలా మంది మండిపడుతుంటారు.. సరిగ్గా ఇలాగే తన అభిమాన హీరో ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అయిన అమలాపురంలో ఓ థియేటర్ వద్ద ఓ వీరాభిమాని చేసిన పనికి అంతా ముక్కున వేలేసుకునేలా చేసింది.. థియేటర్ వద్ద కట్టిన మహేష్‌బాబు ఫ్లెక్సీకు పాలాభిషేకం చేసిన తరువాత అంతటితో తన అభిమానం ఆగక ఏకంగా మరో విపరీతమైన చర్యకు పాల్పడ్డాడు...
మహేష్‌బాబు ఫ్లెక్సీకి రక్తంతో వీర తిలకం దిద్ది..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన బిజనెస్‌మేన్ సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలియంది కాదు.. ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది.. ఈ సినిమా మళ్లీ రీ రిలీజ్ చేశారు. దీంట్లో భాగంగా అమలాపురంలో వెంకటరమణ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. దీంతో మహేష్‌బాబు ఫ్యాన్స్ థియేటర్ వద్ద ఫ్లెక్సీలు కట్టి హంగామా చేశారు.. ప్రిన్స్ మహేష్ బాబు పేరుతో నినాదాలు చేస్తూ బైక్‌లకు సైలెన్సర్‌లు విప్పి మరీ హడావిడి చేశారు.. బాణా సంచా కాల్చారు. థియేటర్ ఎంట్రన్స్ వద్ద నందిపై వెళ్తున్న మహేష్ బాబు వారణాసి సినిమా పోస్టర్‌తో డిజైన్ చేసిన ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. దీంతో ఆపోస్టర్ వద్ద మహేష్ బాబు అభిమానులకు పూనకాలు వచ్చినట్లయ్యింది.
అమలాపురం రూరల్ మండలానికి చెందిన మహేష్‌బాబు వీరాభిమాని కేతా హేమ వర్థన్ ఏకంగా బీరు బాటిల్‌తో పైకి ఎక్కి అంతా చూస్తుండగానే ఆ బీరు బాటిల్‌తో తలకు కొట్టుకున్నాడు.. ఆ గాయం నుంచి కారుతున్న రక్తంతో మహేష్ బాబు ఫ్లెక్సీకు వీరతిలకం దిద్దాడు.. ఈచర్యలతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు..
Not a troll but dini vala emina use unnadi antara 🤔 pic.twitter.com/uSyqy8iQPA
— SravanPspkvj (@sravanPspkVj) November 29, 2025
బీరుబాటిల్‌తో తలపగుల కొట్టుకున్న వీడియో వైరల్..
ప్రిన్స్ మహేష్ బాబు ఫ్లెక్సీకు తన రక్తంతో వీరాభిమాని కేతా హేమ వర్థన్ వీరతిలకం దిద్దిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. బీరు బాటిల్‌తో తన తల పగులకొట్టుకున్న వీడియో కావడంతో పోలీసులు ఫైర్ అయ్యారు.. దీంతో మహేష్ అభిమాని కేతా హేమవర్గన్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా ఆరోజు థియేటర్ వద్ద బాణాసంచా కాల్చడంతోపాటు పెట్రోల్‌తో మంటలు వేసినట్లుగా వీడియోలు వైరల్ అవ్వడంతో దానిపైనా సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై బాద్యునిగా హేమవర్ధన్ పై కేసు నమోదు చేసినట్లు అమలాపురం పట్టణ సీఐ వీరబాబు తెలిపారు.
అభిమానానికి అవధులు లేని కోనసీమ...
కోనసీమ ప్రాంతం అనగానే పవన్ కళ్యాన్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు.. కోనసీమ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రభల తీర్ధమహోత్సవంలో ప్రభలకు పవన్ కళ్యాణ్, మహేష్‌బాబుల ఫ్లెక్సీలతో ఊరేగించిన విషయం తెలిసిందే.. మహేష్‌బాబు ను కృష్ణుడి అవతారంలో దేవుడిగా పేర్కోంటూ గతంలో అభిమానులు వేయించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.. జాతరల్లోనూ, ఉత్సవాల్లోనూ, గ్రామ దేవతల ఊరేగింపుల్లోనూ మహేష్‌బాబు ఫొటోలు ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు కోనసీమలో కోకొల్లలు.. ఇలా తమ అభిమానాన్ని చూపించే కోనసీమ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పడు మరింత ముందుకు వెళ్లి బీరు బాటిల్‌తో తల పగులకొట్టుకుని మరీ రక్తం చిందించి ఆపై వీర తిలకం దిద్దడం చర్చనీయాంశంగా మారింది..





















