Hyderabad Bonalu 2024: భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల సందడి ..జగదాంబికకు జూలై 7న తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం!
Hyderabad Bonalu 2024: ఆషాఢ మాసం బోనాల జాతర సందడి హైదరాబాద్ లో మొదలైంది. జూలై 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారుబోనం సమర్పించిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమవుతాయి...
Hyderabad Bonalu 2024 Dates: జ్యేష్ఠమాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసంలో వచ్చే మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం గోల్కొండకోటపై జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఏడాది జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5 శుక్రవారం వచ్చింది...అంటే జూలై 6 శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది. జూలై 7 ఆషాడంలో వచ్చే మొదటి ఆదివారం రోజు భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహించిన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి...మళ్లీ గోల్గొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. బోనాలు జాతరలో ప్రధానమైనవి ఎనిమిది ఘట్టాలు... ఘటోత్సవం, బోనం సమర్పించడం, వేపాకు సమర్పించడం, ఫలహారం బండి, పోతురాజు వీరంగం, రంగం, బలి, నిమజ్జనం..ఈ 8 ఘట్టాలు అత్యంత ప్రధానమైనవి
Also Read: ఎనిమిది ఘట్టాలతో కూడిన ‘బోనాలు’ పండుగ..మొదలెక్కడ ముగింపేంటి!
ఇదీ బోనాల షెడ్యూల్
జూలై 6 ఆషాడం మాసం ప్రారంభంకాగా..జూలై 7 ఆదివారం భాగ్యనగరంలో బోనాలు మొదలు
జూలై 7 - గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ఆరంభం
జూలై 21 - సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు
జూలై 22 - రంగం , భవిష్యవాణి
జూలై 28 - పాతబస్తీ (లాల్ దర్వాజ) బోనాలు
జూలై 29 - ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు
ఆగష్టు 04 ఆదివారంతో ఆషాడమాసం ముగింపు
అంటే జూలై 7 ఆదివారంతో మొదలయ్యే బోనాలు...ఆగష్టు 4 ఆదివారంతో ముగుస్తాయి. అదే రోజు ఆషాడమాస అమావాస్య... ఆగష్టు 5 సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది...
ఢిల్లీలో తెలంగాణ భవన్ లో 3 రోజులు బోనాల వేడుకలు
లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏటా ఢిల్లీలో తెలంగాణ భవన్ లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా జూలై 8,9,10 తేదీల్లో మూడు రోజుల పాటూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తరఫున ఉత్సవాలు జరగనున్నాయి.
Also Read: వందల ఏళ్లుగా జరుగుతున్న సంబురం.. ప్రకృతికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే బోనం!
పుట్టింటికి అమ్మవారు
ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని భక్తుల విశ్వాసం... అందుకే అమ్మను తమ ఇంటి ఆడబిడ్డలా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవైద్యాలు సమర్పిస్తారు. అప్పట్లో బోనాల పండుగ ప్రారంభించే సమయంలో దుష్టశక్తులను తరిమేసేందుకు దున్నపోతుని బలిచ్చేవారు. ఇప్పుడు దున్నపోతుకి బదులు కోడి, మేకలను బలిస్తున్నారు. బోనాలు తీసుకెళ్లే మహిళలపై అమ్మవారు ఉంటుందని భక్తుల నమ్మకం..అందుకే బోనంపట్టుకున్న మహిళలు ఆలయాన్ని సమీపించగానే పాదాలపై నీళ్లుచల్లి నమస్కరిస్తారు. హైదరాబాదులోని జగదాంబిక అమ్మవారి ఆలయం తొలి బోనం సమర్పిస్తారు.. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఇస్తారు.
Also Read: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
ఆషాడంలోనో బోనాలెందుకు!
ఆషాడమాసంలో వర్షాల కారణంగా అంటువ్యాధులు విజృంభిస్తాయి...వైరస్ లు వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధుల నుంచి కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా అంటూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. పూజకోసం ఉపయోగించే వస్తువులైన వేపాకులు, పసుపునీళ్లు..ఇవన్నీ వైరస్ ను తరిమికొట్టేవే...