Bonalu Festival 2024 : ఎనిమిది ఘట్టాలతో కూడిన ‘బోనాలు’ పండుగ..మొదలెక్కడ ముగింపేంటి!
Bonalu in Hyderabad 2024: బోనాలు వేడుకలో ప్రధానమైనవి 8 అంగాలు.. ఘటోత్సవం, బోనాలు సమర్పించడం మొదలు.. రంగం, నిమజ్జనం వరకూ అవేంటో వివరంగా తెలుసుకుందాం...
Bonalu Festival 2024 : ఆషాడమాసంలో గ్రామదేవతలను పూజించే సంప్రదాయం విస్తృతంగా కనపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ సంప్రదాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. బోనాల విషయానికొస్తే సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటూ తెలంగాణ వ్యాప్తంగా,రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉండే హిందువులు జరుపుకుంటారు. భాగ్యనగరంలో బోనాలంటే ఆ కళే వేరు. దీన్నే ఆషాడం జాతర అనికూడా పిలుస్తారు. 1869లో జంట నగరాలలో ప్లేగువ్యాధి వ్యాపించినప్పుడు అమ్మవారి ఆగ్రహానికి గురయ్యామని భావించిన ప్రజలంతా అమ్మను శాంతింపజేసేందుకు ఈ పండుగ చేయడం ప్రారంభించారు. ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ ఆలయం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్, పాతబస్తీ ఆలయాల్లో వరుసగా జరుగుతుంది.
Also Read: భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి..జగదాంబికకు జూలై 7న తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం!
బోనాలు ఈ సంబురంలో ప్రధాన మైన 8 అంగాలు..అవేంటో తెలుసుకుందాం
ఘటోత్సవం
ప్రత్యేకమైన ఘటం (కలశం)లో అమ్మవారిని ఆవాహనచేసి ఊరేగింపుగా తీసుకెళతారు. బోనాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి పద్నాలుగో రోజు వరకూ ప్రతి రోజూ రెండు పూటలా అమ్మవారు కలశం రూపంలో నగరాల్లో, ఊర్లలో తిరుగుతూ భక్తుల నుంచి పూజలందుకుంటుంది. ఘటం అంటే కళసం, నగరవీధులగుండా ఉరేగింపుగా తీసుకెళతారు. ఈ ఘటంపై అమ్మవారి రూపాన్ని చిత్రీకరిస్తారు. ఆలయ పూజారి ఒళ్లంతా పసుపు పూసుకుని ఘటాన్ని ఊరేగిస్తారు..
బోనాలు
బోనం అంటే భోజనం..అనుక్షణం కాపాడే శక్తి స్వరూపిణికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే ఆహారం. ఎవరెవరు ఎలాంటి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకున్నావో అవన్నీ అమ్మకు చెల్లిస్తారు. ముఖ్యంగా చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, పసుపుఅన్నం ఇలా వివిధ రకాల ఆహారాన్ని సమర్పిస్తారు. ఇల్లు వాకిలి శుభ్రంచేసి , తలకు స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి ..నైవేద్యం తయారు చేస్తారు. పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన పాత్రలో అన్నాన్ని ఉంచి దానిపై మూతపెట్టి దీపం వెలిగించి..గుంపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.
Also Read: వందల ఏళ్లుగా జరుగుతున్న సంబురం.. ప్రకృతికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే బోనం!
వేపాకు సమర్పించడం
సర్వ రోగనివారిణి అయిన వేపాకులను ఎన్నో ఔషధ గుణాలన్న పసుపునీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారాన్నే వేపాకు సమర్పించడం అంటారు. వానాకాలం మొదలైన సందర్భంగా వ్యాపించే క్రిమికీటకాలను తరిమికొట్టేందుకు క్రిమినాశినిగా వేపాకు ఉపయోగపడుతుంది... పైగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం కూడా ఇదే.
ఫలహారం బండి
‘బోనాలు’ జరుపుకునే రోజు భక్తులంతా..నియమ నిష్టలతో తయారు చేసిన నైవేద్యాలను తీసుకొచ్చి బండ్లలో పెట్టిన తర్వాత ఆ బండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. దీనినే ఫలహారబండి ఉత్సవం అంటారు.
పోతురాజు వీరంగం
పోతురాజు అంటే ఏడుగులు అమ్మవార్లకు సోదరుడు. బోనాలు పండుగలో పోతురాజలే ప్రత్యేక ఆకర్షణ. ప్రతి బస్తీనుంచి పోతురాజు అమ్మవారి ఆలయం వరకూ విన్యాసాలు చేసుకుంటూ వెళతారు. కాళ్ళకి గజ్జెలుకట్టి, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో ముంచిన ఎర్రటి వస్త్రాన్ని ధరించి...కళ్లకు కాటుక, కుంకుమతో పెద్ద బొట్టు, నడుముకు వేపాకు చుట్టి..పసుపు రంగు కొరటా ఝుళిపించి నాట్యం చేస్తూ ఫలహారం బండి ముందు నడుస్తాడు.
Also Read: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
రంగం
బోనాలలులో చివరి రోజు జరిగే ముఖ్యమైన ఘట్టం రంగం. అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఓ స్త్రీ మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల గురించి అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది.
బలి
రంగం ముగిసిన మర్నాడు పోతురాజులు అమ్మవారి సన్నిధిలో భక్తితో తాండవం చేస్తారు. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి కూరగాయల్ని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. అప్పట్లో జంతువులను బలిచ్చేవారు.
సాగనంపుట
బలిచ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి కలశాలతో పాటూ ఏనుగుపై ఎక్కించి మంగళవాయిద్యాల మధ్య ఊరేగించి నిమజ్జనం చేస్తారు.
Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!