Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
Tollywood News : మంచు విష్ణు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సిబ్బంది అడవిలో పందుల కోసం వేట సాగించారు.
Manchu Vishnu in another controversy : మంచు ఫ్యామిలీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలి కాలంలో వీరి ఫ్యామిలీ వివాదాలు రచ్చకెక్కి.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకూ వెళ్లిన వీళ్ల గొడవకు సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మరోపక్క ఓ జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేయడంతో.. ఆయనపపై కేసు నమోదు చేశారు. ఆ మధ్యలో విదేశాలకు వెళ్లొచ్చిన ఆయన తిరుపతిలో ఉన్నానని చెప్పి సైలెంట్ అయ్యారు. ఇక తాజాగా మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సిబ్బంది అడవిలో సాగించిన వేట చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జల్ పల్లిలోని అడవిలో మంచు విష్ణు సిబ్బంది వేట కొనసాగించారు. అడవి పందుల కోసం సాగిన వేటలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మేనేజర్ కిరణ్,ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ చెరో వైపున ఉండి ఒక కర్ర మధ్య అడవి పందిని బంధించి తీసుకెళ్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరిద్దరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంచు విష్ణుగానీ, ఆయన టీమ్ గానీ స్పందించాల్సి ఉంది.
అభ్యంతరం తెలిపిన మంచు మనోజ్
ఈ తరహా చర్యలను తప్పుపడుతూ మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. అయినప్పటికీ వాళ్లు వినలేదని తెలుస్తోంది. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించినప్పటికీ మేనేజర్, ఎలక్ట్రిషన్ పట్టించుకోలేదు. జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు పరారీలో ఉన్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి తమ మనుషులు అడవిలో జంతువులని వేటాడి చంపిన విషయం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
మంచు విష్ణు నుంచి ప్రాణ హాని - మనోజ్ ఫిర్యాదు
మంచు కుటుంబంలో వివాదం ఇంకా కొనసాగుతోనే ఉంది. తన అన్న మంచు విష్ణు నుంచి ప్రాణ హాని ఉన్నట్టు మనోజ్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మరోసారి పహాడీషరీఫ్ పోలీసులను
ఆశ్రయించిన ఆయన.. ఏడు పేజీలతో కూడా ఫిర్యాదులో పలు అంశాలు ప్రస్తావించాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ - కన్నప్ప
మరో పక్క మంచు విష్ణు సినిమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న కన్నప్ప మూవీ పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోంది. ఈ పీరియాడికల్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహా భారతం సీరియల్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. ప్రభాస్ ఈ మూవీలో శివుడిగా కనిపించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మంచు విష్ణుతో పాటు ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నయన తార, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) లాంటి ప్రముఖ నటులు భాగం కానున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు పాత్రల పేర్లను మేకర్స్ రివీల్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది కన్నప్ప చిత్ర బృందం. ఇందులో కోలీవుడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. నెమలి అనే రాజకుమార్తె పాత్రలో ఆమె కనిపించనుంది.