Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ
Kerala Nurse: యెమెన్‌లో ఓ భారతీయ నర్సుకు ఆ దేశాధ్యక్షుడు మరణ శిక్ష విధించారు. ఓ హత్యానేరంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కేరళ నర్సు నిమిష ప్రియా 2017 నుంచి అక్కడ జైల్లో మగ్గుతున్నారు.
Kerala Nurse Sentenced To Death In Yemen: యెమెన్‌లో (Yemen) ఓ హత్యా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిష ప్రియాకు (Nimisha Priya) ఆ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలిమి మరణశిక్ష విధించారు. కొన్ని నెలల్లోనే ఆమెకు ఈ శిక్షను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్యా నేరంపై ఆమె దాదాపు 2017 నుంచి యెమెన్ జైల్లో మగ్గుతోంది. అయితే, నర్సును విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజాగా, ఈ అంశంపై విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. 'భారతీయ నర్సు ప్రియాను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాలు అన్వేషించడాన్ని అర్థం చేసుకోగలం. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది.' అని పేర్కొన్నారు.
అసలు కేసు ఏంటంటే.?
నిమిష ప్రియా నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ ఆదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష - థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమెన్ వెళ్లిపోగా.. భర్త, కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు.
మెహది ఇదే అదనుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడం సహా వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్య మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్ పోర్ట్, ఇతర పత్రాలను లాక్కున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతనిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న పాస్ పోర్టును తీసుకోవాలని భావించింది. అయితే, ఆ డోస్ ఎక్కువ కావడంతో అతను చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసి.. అక్కడి నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
అలా చేస్తేనే..
అయితే, మృతుడి కుటుంబానికి కొంత పరిహారం చెల్లిస్తే.. నిందితులను క్షమించి వదిలేసే ఛాన్స్ యెమెన్‌లో ఉంది. దీంతో ప్రియా కుటుంబం దాదాపు 40 వేల డాలర్లను (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.34,20,000) మెహది కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకే భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన న్యాయవాది అబ్దుల్ అమిర్ 20 వేల డాలర్లు డిమాండ్ చేశాడని నిమిష ప్రియా తల్లి ప్రేమకుమారీ ఆరోపించారు. దీంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.