Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Rajampet Crime News | ఉరి ఎలా వేసుకోవాలో భార్యకు సూచనలు చేస్తూ భర్త సెల్ ఫోన్‌లో వీడియో రికార్డు చేసిన దారుణ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.

రాజంపేట: కడప జిల్లా రాజంపేటలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆపి, సర్దిచెప్పాల్సిన భర్తే ఆమెకు అందుకు మరింతగా ప్రేరేపించాడు. ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలంటూ భార్యకు సూచనలు చేస్తూ తన మొబైల్‌లో వీడియో కూడా రికార్డు చేశాడు. భర్త పైశాచిక ఆనందానికి ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది.
అసలేం జరిగిందంటే..
రాజంపేట కొత్త బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న శ్రీరామ్ శ్రీనివాసులు రైల్వే శాఖలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయనకు, భార్య కృష్ణవేణికి మధ్య గొడవలు ఏదో విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం మరోసారి గొడవ జరగడంతో ఇక వేధింపులు తట్టుకోలేక భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను కాపాడాల్సింది పోయి, భర్త శ్రీనివాసులు అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాన్ని కిటికీ బయట నిలబడి తన సెల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేశాడు.
అలా కాదు.. ఉరి ఇలా వేసుకోవాలని ప్రేరేపించిన భర్త
అంతటితో ఆగకుండా ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి అంటూ ఆమెకు సూచనలు చేస్తూ, నవ్వుతూ ఆ తతంగాన్ని ఫోన్లో వీడియో రికార్డ్ చేయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రవర్తన చూసి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా, అప్పటికే కృష్ణవేణి మృతి చెంది ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీనివాసులను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అసలు ఆ వీడియో తీయడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్యకు ప్రేరేపించాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని బాధితురాలి బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
























