Bhogi Goda Kalyanam 2024: తిరుప్పావై, పాశురాలు అంటే ఏంటి - శ్రీ రంగనాథుడిలో కలసిపోయిన గోదాదేవి ఎవరు!
Dhanurmasam 2024: ఏటా డిసెంబరు మూడో వారం నుంచి భోగి వరకూ ధనుర్మాసం ఉంటుంది. ఈ సమయంలో ఆండాళ్, గోదాదేవి, తిరుప్పావై, పాశురాలు అనే పదాలు ఎక్కువ వినిపిస్తాయి..ఇంతకీ తిరుప్పావై అంటే ఏంటి!
Bhogi Goda Kalyanam 2024: ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం. ధను అంటే ప్రార్థించడం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
Also Read: ఆండాళ్ ఎవరు - భక్తితో కూడిన ఆమె అద్భుతమైన ప్రేమకథ తెలుసా!
తిరుప్పావై అంటే!
గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. 'తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేదా వ్రతం అని అర్ధం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాట. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.
Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి రోజు మీ రాశిఫలితం, జనవరి 14 రాశిఫలాలు
తిరుప్పావై వ్రత నియమాలు
తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను పాడాలి. నిత్యం స్వామివారికి పొంగల్ నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.
Also Read: భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!
ఆళ్వారులు అంటే ఎవరు
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగితేలే వారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. భూదేవి ఆండాళ్ గా జన్మించిందని చెబుతారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్టు శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తుడు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికిందంటారు. భగవంతుడిని కాకుండా ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి, ఆండాళ్ ఇద్దరూ భూదేవి అంశకాక మరేంటని చెబుతారు. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
పాశురాల్లో ఏముంటుంది
ధనుర్మాసం 30 రోజులకు ఒక్కో రోజుకి ఒక్కో పాశురం చొప్పున గోదాదేవి రచించిన 30 పాశురాలు.. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు.
Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!
మొదటి అయిదు పాశురాలు
ధనుర్మాసం గురింి ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే, పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది.
5 నుంచి 15 పాశురాలు
గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలో సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ శ్రీమహా విష్ణువు అవతారాలను పొగుడుతుంది.
Also Read: కనుమ శుభాకాంక్షలు తెలియజేసేందుకు కొటేషన్స్!
16 నుంచి 20 పాశురాలు
గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను 15 నుంచి 20 పాశురాలు వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటుంది. తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు.
21 నుంచి 30 పాశురాలు
21 నుంచి 29 పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తెనని ఈ 30 పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది.