CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
తెలంగాణ విద్యా శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆ శాఖని ఎవ్వరికీ ఇవ్వను అని చెప్పారు. తన దగ్గరే అట్టిపెట్టుకుంటా అన్నారు.

Revanth Reddy on Education: త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. ఇంకా కేబినెట్‌లో ఆరుగురు మంత్రులకు స్థానం ఉంది. కీలకమైన శాఖలు కొంత మంది మంత్రుల దగ్గరే ఉండటంతో వాటిని బదిలీ చేస్తారని భావిస్తున్నారు. వాటిలో ముఖ్య మైంది విద్యాశాఖ. ప్రాథమిక, ఉన్నవిద్య, సాంకేతిక విద్య ఇలా మూడు విభాగాలతో అతిపెద్ద శాఖల్లో ఒకటిగా ఉంటుంది విద్యాశాఖ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో మంత్రి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. వేల కోట్ల బడ్జెట్ ఉన్న విద్యాశాఖకు ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేక మంత్రి లేరు. సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఆ శాఖ ఉంది. అంతటి కీలకమైన శాఖను తాను ఎవ్వరికీ ఇవ్వను అని చెప్పేశారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీలో విద్యాశాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం.. విద్యాశాఖను వేరొకరికి కేటాయించే ఉద్దేశ్యం లేదన్నారు. తాను ప్రభుత్వ బడుల్లో చదువుకున్న ఉన్నత స్థాయికి ఏదిగానని.. విద్యాశాఖపై ఉన్న ప్రేమతో దానిని తానే నిర్వహిస్తానని చెప్పారు.
సమూల ప్రక్షాళన
విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రమాణాలు దిగజారిపోయాయని.. ముఖ్యమైన సబ్జెక్టులు, లాంగ్వేజ్‌లలో పిల్లల ప్రమాణాలు జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. రాజకీయ కోణంలో చూడకుండా సామాజిక బాధ్యతతో విద్యాకమిషన్‌ను సూచనలు ఇస్తే తాము పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో 10వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టామని ఒక్కో విద్యార్థిపైన లక్షా 8వేలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు.
నైపుణ్యాలు తక్కువుగా ఉన్నాయి అందుకే స్కిల్ యూనివర్సిటీ
తెలంగాణ విద్యార్థుల్లో నైపుణ్యాలు తక్కువుగా ఉన్నందునే హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువుగా ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటున్నారని తాము గుర్తించామన్నారు. తెలంగాణ యువతకు నైపుణ్యాలు పెంచే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇందుకోసం ఎవరు కార్పస్ సమకూర్చినా తీసుకంటాం అని చెప్పారు. విద్యా ప్రక్షాళనను రాజకీయాల కోసం కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. పార్టీలకు సామాజిక బాధ్యత ఉండాలని.. స్కిల్ యూనివర్సిటీ కోసం వచ్చిన విరాళంపైనా గొడవ చేయడంతో అది వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంచడానికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని సూచించారు.
తెలంగాణలో ఒలంపిక్స్
2036 ఒలంపిక్ బిడ్స్ కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోందని.. వాటిని తెలంగాణలో నిర్వహింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తామని రేవంత్ అన్నారు. 14౦కోట్ల మంది భారతీయులలో పారిస్ ఒలంపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేకపోవడం బాధాకరమన్న ఆయన సౌత్ కొరియాను స్పోర్స్ట్‌లో ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిన్న దేశం అయినా కూడా కొరియా పెద్ద సంఖ్యలో పథకాలు గెలుస్తుందన్నారు. సౌత్ కొరియాను పరిశీలించిన తర్వాత అదే మోడల్‌లో తెలంగాణలో స్పోర్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నామని చెప్పారు. 2036 ఒలంపిక్స్ లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

