Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Telangana News: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తుతానికి హోల్డ్ చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సీట్లపై కేంద్రానికి ముఖ్యమంత్రి ఓ విజ్ఞప్తి చేశారు.

Telangana News:జనాభా ప్రాతిపదిక డీలిమిటేషన్ చేపడితే రాష్ట్రాల మధ్య వైషమ్యాలు వస్తాయని తెలంగాణ తీర్మానం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసిన తర్వాత ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
"ఇప్పుడు గంభీరమైన వాతావరణం, ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు అన్నీ కలిసి కేంద్రం చర్యలు ఎదుర్కోవాలని తీర్మానించాం. ఇందిరాగాంధీ, వాజ్‌పేయీ సవరణ చేసినట్టుగానే ఇప్పుడు కూడా మళ్లీ మరో పాతికేళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రులు చెబుతున్నారు. అందుకే ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించాలని నిర్ణయించాం. కేంద్రం ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చట్టాలను పక్కగా అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు దాన్ని పట్టించుకోలేదు. అందుకే అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. "
"డీలిమిటేషన్ ప్రక్రియను భాగస్వాములతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా ప్లాన్ చేస్తున్న తీరుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాస్వామ్యవాదులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సభ కోరుతోంది.
కేంద్రం ముందుకు తెచ్చిన జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి జనాభా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించకూడదు. అందుకే డీలిమిటేషన్‌కు జనాభా ఏకైక కొలమానం కాకూడదు.
జాతీయ జనాభా స్థిరీకరణకు ఉద్దేశించిన 42వ, 84వ, 87వ రాజ్యాంగ సవరణల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇంకా సాధించలేదని గమనించాలి. అందువల్ల, పార్లమెంటరీ సీట్ల సంఖ్య పెంచే ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేసి, రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, పార్లమెంటరీ నియోజకవర్గాపై నిర్ణయం తీసుకోవాలి. తాజా జనాభా ప్రకారం SC, ST సీట్లు పెంచడం, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కూడా చేయవచ్చు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, తాజా జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను వెంటనే 119 నుంచి 153కి పెంచాలని సభ తీర్మానించింది. దీని కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది." అని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు.
నియోజకవర్గాల పునర్విభజనపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ఎవర్నీ సంప్రదించకుండా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని నాడు ఇందిరా గాంధీ భావించారని గుర్తు చేశారు. అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన చేశారని తెలిపారు.
ఇప్పుడు నియోజక వర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే కచ్చితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందన్నారు.
దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం వినియోగించుకుంటోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా అందరూ దీనిపై ఒకే మాటపై నిలబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టామని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మనపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.
2026 జనాభా లెక్కింపు తర్వాతే చేపడతామని ఆనాడు పార్లమెంట్‌లో తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినట్‌టు గుర్తు చేశారు రేవంత్. జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచారని గుర్తు చేశారు. సిక్కింలో 2018లో కేబినెట్ లో రిసోల్యూషన్ పాస్ చేసి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజల ముందుంచేందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టామని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిద్దామన్నారు. అవసరమైతే పోరాట బాట పడుదామని పిలుపునిచ్చారు
త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

