No Alliance Politics : సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లినట్లేనా ? కూలిపోతున్న ప్రభుత్వాలే సాక్ష్యమా ?
దేశంలో సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లినట్లేనా ? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆశీస్సులు లేకపోతే ప్రభుత్వాలు నడవవా ?
No Alliance Politics : భారతదేశం ప్రజాస్వామ్యం మెజార్టీ మీద ఆధారపడి ఉంది. మెజార్టీ అభిప్రాయమే గెలుపు. వంద మందిలో ముఫ్పై మంది మాత్రమే ఓట్లు వేసినా... ఇతరులు ఎవరూ 31 ఓట్లు తెచ్చుకోకపోతే గెలుపు 30 ఓట్లు తెచ్చుకున్నవారిదే. వారే పాలకులు. మచట్టసభలో అయితే మెజార్టీ మార్క్ తెచ్చుకోవాలి. సభలో ఉన్న చట్టసభ సభ్యుల కంటే ఒక్కరి మద్దతు అధికంగా పొంది.. మెజార్టీ ఉందని నిరూపించుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో ప్రధాన లక్షణం కూడా అదే. ఓట్లు అయినా సీట్లు అయినా అదే పరిస్థితి. ఇక్కడే సంకీర్ణ శకానికి నాంది పడింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు కూటములుగా ఏర్పడటం అయినా.. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడినా ఓట్లు కలుపుకోవడమో.. సీట్లు కలుపుకోవడమో చేసి మెజార్టీ సాధించడమే లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ సంకీర్ణాలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. డైనమిక్‌గా మారుతున్న రాజకీయాల కారణంగా సంకీర్ణ ప్రభుత్వాలు మనుగడ సాధించే పరిస్థితి లేకుండా పోయింది. దానికి తాజా సాక్ష్యం...మహారాష్ట్ర ప్రభుత్వం.
నిలబడలేకపోతున్న సంకీర్ణ ప్రభుత్వాలు !
2014 ఎన్నికల ముందు వరకు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో ఏకపార్టీ ప్రభుత్వం లేదు. ఓటర్లు ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు.అప్పుడంతా దేశ రాజకీయాల్లో సంకీర్ణ శకం నడిచింది. అనేక పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల మంత్రివర్గంలో విభేదాలు తలెత్తడం, వేడివేడి చర్చలు, సంప్రదింపులు,బుజ్జగింపుల తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రధాన మంత్రులు విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా సార్లు ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. అదే సమయంలో రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో సంకీర్ణాలు విజయవంతంగా నడిచాయి. ఎక్కడిదాకో ఎందుకు మహారాష్ట్రలోనే బీజేపీ- శివసేన ప్రభుత్వం కూడా విజయవంతంగా నడిచింది. అయితే గత దశాబ్దకాలంగా పరిస్థితి మారిపోయింది. ఏ ఒక్క సంకీర్ణ ప్రభుత్వం ... ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు లేని సంకీర్ణం మనుగడ సాగించడం లేదు.
వరుసగా కూలిపోతున్న సంకీర్ణ ప్రభుత్వాలు !
ఈశాన్య రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువే. సీట్ల సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ అక్కడ నడిచేది సంకీర్ణ ప్రభుత్వాలే. ఇలాంటి ప్రభుత్వాలు శరవేగంగా కూలిపోయాయి. మళ్లీ ఏర్పటయ్యాయి. అయితే అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీ మద్దతుతోనే ఏర్పటయ్యాయి. కొనసాగుతున్నాయి. అదే పరిస్థితి పెద్ద రాష్ట్రాల్లోనూ ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ పూర్తి సీట్లు రాలేదు. మెజార్టీకి అవసరం అయిన సీట్లు కొన్ని తక్కువే సాధించింది. ఇండిపెడెంట్ల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ చివరికి.. నిలబెట్టుకోలేకపోయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే మళ్లీ వచ్చింది. అదే పరిస్థితి కర్ణాటకలోనూ వచ్చింది. కర్ణాటకలో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేసినా ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిశాయి. కానీ బీజేపీ కొన్నాళ్లు వేచి చూసి వాళ్లంతటకు వాళ్లు కూలిపోకపోయే సరికి ఆపరేషన్ కమల్ పూర్తి చేసింది. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. చూస్తూంటే రేపోమాపో మహారాష్టర్ కూడా బీజేపీ పాలిత రాష్ట్రం అయ్యే సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.
కేంద్రం మద్దతు లేని సంకీర్ణాల మనుగడ కష్టమే !
ఇక్కడ సంకీర్ణాలు మనుగడ సాగించడం సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోవడం సమస్య. అంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయగలదని అర్థం చేసుకోవచ్చు. అదే కేందరంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓ పాలకపక్షంగా ఉన్న సంకీర్ణాలు సాఫీగానే సాగుతున్నాయి. ఈ పరిణామాలతోనే దేశ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు వస్తున్నాయి. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే సంకీర్ణాలే కాదు...అరకొర మెజార్టీ వచ్చినా ప్రభుత్వాలు నిలబడటం కష్టం. థంపింగ్ మెజార్టీ వస్తేనే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయగలరు. లేకపోతే ప్రభుత్వాలు కూలిపోవాల్సిందే.
తప్పు రాజకీయ పార్టీలది కాదు.. నేతలదే !
ఈ రాజకీయ పరిణామాల్లో బీజేపీని రాజకీయ వ్యూహాలను కానీ తప్పు పట్టాల్సిన పని లేదు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే చేసింది ఇదే. ఇప్పుడు బీజేపీ చేస్తున్నది అదే. కాకపోతే ఇప్పుడు మరింత విస్తృతం అయింది. అసలు రాజకీయ నేతలు నిబద్ధతతో ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. మహారాష్ట్ర పరిణామాలనే తీసుకుంటే... ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పాలన చేస్తున్నామన్నసంగతి గుర్తించినట్లుగా కొత్త వాదన లెవనెత్తుతున్నారు. ఆయన తిరుగుబాటు చేయాలనుకున్నారు చేస్తున్నారు.. అందరూ అంతే. ఇలాంటి రాజకీయాల కారణంగానే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. వీరంతా ఓ సిద్దాంతానికి కట్టుబడి ఉంటే... ఇలాంటి పరిస్థితులు తలెత్తవు. ఈ పరిస్థితి రావడానికి రాజకీయాల్లో పడిపోతున్న విలువలే కారణం అని అనుకోవచ్చు.