Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు ఉక్కపోత- 17 తర్వాతే రుతుపవన వర్షాలు !
Weather Latest Update: రుతుపవనాలు ఒక రోజు ముందానే ఏపీని తాకినప్పటికీ వాతావరణంలో మార్పు లేదంటోంది వాతావరణ శాఖ. అక్కడక్కడ అకాల వర్షాలతే తప్ప రుతుపవన వానలు పడబోవని స్పష్టం చేస్తోంది.
Weather Latest Update: ఏపీని రుతుపవనాలు తాకినప్పటికీ ఐదు రోజుల పాటు వేడి వాతావరణం ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఒక రోజు ముందుగానే నైరుతి ఏపీలోకి ప్రవేశించింది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాలను రుతుపవాలు తాకడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. కానీ బిపర్‌జోయ్ తుపాను కారణంగా ఒక రోజు ముందుగానే నైరుతి రాగం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది.
తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఆదివారం విస్తరించాయని తెలిపింది. తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, కర్ణాటకలోని శివమొగ్గ, హాసన్ ప్రాంతాలతో పాటు ఏపీలో తిరుపతి జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
నైరుతి రుతుపవనాల రాకతో రాయలసీమతో పాటు సరిహద్దుగా ఉన్న తమిళనాడు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.
రుతుపవనాలు విస్తరించే వరకు ఉక్కపోతే!
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా వ్యాపించేంత వరకు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని ఏపీ వెదర్ మ్యాన్ అన్నారు. జూన్ 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో హీట్ వేవ్ ఇలాగే ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉక్కపోత అధికంగా ఉండనుంది. కోస్తా ఆంధ్రలో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు సులభంగా 43-44 C తాకవచ్చు అని కొన్ని ప్రాంతాలలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ప్రజలు మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని సూచించారు.
సోమవారం 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం అనకాపల్లి, కాకినాడ జిల్లా కరప, విజయనగరం జిల్లా జామిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ జిల్లా పద్మనాభంలో 44.7, మన్యం జిల్లా భామిని, కోనసీమ జిల్లా శివలలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడనున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ఏపీ వెదర్‌మ్యాన్ సాయిప్రణీత్ చెబుతున్నారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు భాగాల్లో వర్షాలు ఉంటాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.
కోస్తాంధ్రలో అకాల వర్షాలు పడబోతున్నాయని తెలిపారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు అకాల వర్షాలు జోరుగా పడబోతున్నాయి. జూన్ 17 నాటికి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు పడతాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. జూన్ 17 వరకు పడేవన్నీ అకాల వర్షాలే అని చెబుతున్నారు. 17 తర్వాత 21 వరకు వర్షాల జోరు పెరగనుంది. 21 నాటికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించబోతున్నాయి. తర్వాత ఎండ తీవ్రత పూర్తిగా తగ్గుముఖ పడతాయన్నారు.
'బిపర్ జాయ్' తుపాను అరేబియా సముద్రంలో తీవ్రరూపం దాల్చుతోంది. మంగళవారం పాకిస్థాన్, గుజరాత్ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని ప్రభావం రానున్న 24 గంటల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని ఎన్డీఆర్ఎస్ సిబ్బందిని, అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు వాతావరణం కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బిపర్ జాయ్ తుపాను పోర్ బందర్ తీరానికి దగ్గరగా 460 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తీర ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.