Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
TDP: ప్రతిపక్ష హోదాపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను నారా లోకేష్ ఖండించారు. అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Minister Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డిలా ఉంటారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బాగా ఫ్రస్టేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నీతులు, విలువలు గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి హుందాగా, వాస్తవాలు మాట్లాడతారని మేం భావించాం. ఒక వ్యక్తిని కించపరిచే విధంగా జగన్ రెడ్డి మాట్లాడారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయనకు విలువలు లేవని, ఏదీ రాదని అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి రారు. ఎప్పడూ దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు.
సీఎం పదవి కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్ రెడ్డి
ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మాపై నిందమోపారు. ఈ రోజు ప్రభుత్వంపైన, బడ్జెట్ పైన, ఉపముఖ్యమంత్రి పవన్ గారిపైన మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు పరదాలు ప్రభుత్వం పోయింది. బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎన్నడూ లేనివిధంగా ప్రజలు కోరుకున్నట్లు, ప్రజలకు అవసరమైన వాటిని బడ్జెట్ లో పెట్టాం. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అని పదేపదే చెప్పిన వ్యక్తికి ప్రజలు 11 స్థానాలు కట్టబెట్టారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఇప్పటికీ ఆయన తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి వన్ డే ముఖ్యమంత్రి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు వచ్చి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పి వెళ్లిపోతారు. మళ్లెప్పుడూ కనిపించరని విమర్శించారు.
ఉప ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా జగన్ రెడ్డి మాట్లాడారు
జగన్ రెడ్డికి ప్రజలు ఎందుకు 11 స్థానాలు ఇచ్చారో ఆలోచించాలి. సొంత చెల్లి, తల్లి, కార్యకర్తలే నమ్మడం లేదని ఆయన ఆలోచించుకోవాలి. బ్యాలెట్ ఎన్నికల్లో కూడా 67 శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, రాజశేఖర్ గారికి వచ్చాయి. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వానిదే. అలాంటిది ఇవాళ గౌరవ ఉపముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ ఎంత, పవన్ గారికి ఎంత? వైసీపీ ఎన్నిసీట్లు వచ్చాయి, జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయో జగన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కదా అని తాను అనుకున్నదే కరెక్ట్, అధికారంలో ఉన్నవారిని కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేసే విధంగా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదు
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల తర్వాత మాపై బాధ్యత పెరిగింది. వన్ మ్యాన్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఈ నెలలోనే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇచ్చిన ప్రతి హామీ పద్ధతి ప్రకారం అమలుచేస్తున్నాం. ఇప్పటికైనా జగన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎందుకు 11 సీట్లు వచ్చాయో బేరీజు వేసుకోవాలి. కార్యకర్తల వద్దకు వెళ్లి తన తప్పులు తెలుసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ప్రజలు వారిని గెలిపించారు. ఎవరికీ రాని మెజార్టీలతో గెలిచి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని కించపరిచేలా మాట్లాడితే మేం సహించబోం. మేం కూడా గట్టిగానే మాట్లాడతాం. మేం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని సలహా ఇచ్చారు.
చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా?
నేడు అసెంబ్లీ పరిసరాల్లో పోలీసుల సంఖ్య తగ్గింది. ఎక్కడా పరదాలు లేవు. ఎవరైనా ప్రశాంతంగా రావొచ్చు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రెడ్డికి ఉన్న హక్కులు వినియోగించుకోవచ్చు. హౌస్ కు రావొచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ఆయనకు భయం పట్టుకుంది. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. రెండు రోజుల్లో మళ్లీ బెంగుళూరు వెళ్లిపోతారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారా? జగన్ రెడ్డికి చట్టాన్ని ఉల్లంఘించడం బాగా అలవాటు. అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ రూల్ బుక్ లో చాలా స్పష్టంగా 10శాతం సభ్యులు ఉండాలని చెప్తోందని గుర్తు చేశారు.
వైసీపీ నేతలు చేసిన తప్పులే వారి మెడకు చుట్టుకుంటున్నాయి
మేం ఎవరిపైన దాడి చేశారో జగన్ రెడ్డి చెప్పాలి. జగన్ రెడ్డి ఏపీలో స్వేచ్ఛగానే తిరుగుతున్నారు కదా. ఆయన గేటుకు మేం తాడు కట్టలేదు. ఆయన వాహనాలపై చెప్పులు వేయలేదు. ఆనాడు చంద్రబాబు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్తుంటే గేటుకు తాడు కట్టారు. మేం అందరం అమరావతిని సందర్శించేందుకు బస్సులో వెళ్తుంటే బస్సుపైకి వైసీపీ కార్యకర్త చెప్పు విసిరేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ అని డీజీపీ చెప్పారు. వారు చేసిన తప్పులే వారికి చుట్టుకుంటున్నాయి. దానికి మేమేం చేస్తాం? చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తోందన్నారు.
మద్యంలో అవినీతి చేయలేదని సొంత బిడ్డలపై జగన్ రెడ్డి ప్రమాణం చేయగలరా?
జగన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ తీసేస్తారు. సీబీఐని రద్దు చేస్తారు, సీఐడీని మూసేస్తారు. ఎందుకంటే ఆయన దందాకు అడ్డువస్తున్నారు కాబట్టి. రూల్ బుక్ ప్రకారం ప్రతిపక్ష హోదాకు 10శాతం మంది సభ్యులు ఉండాలి. ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్లే. ప్రజలు నిర్ణయిస్తారు. 40శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి హౌస్ లోకి వస్తానంటే ఎలా అని ప్రశఅనించారు. అవాస్తవాలు చెప్పడం మాకు అలవాటు లేదు. సీపీఎస్ ను జగన్ రెడ్డి ఎందుకు రద్దు చేయలేదు? సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎందుకు అమలుచేయలేదు? సొంత బినామీలను పెట్టుకుని అడ్డగోలుగా మద్యంపై డబ్బు సంపాదించారు. మద్యంలో అవినీతి చేయలేదని సొంత బిడ్డలపై జగన్ రెడ్డి ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

