Congress Mallanna: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న ఆరోపణలు కలకలం రేపాయి. మధుయాష్కీ కూడా కొత్తగా ఆరోపణలు ప్రారంభించారు.

Congress party Politics: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల ఆరోపణలు క్రమంగా పెరుగుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. తనను కాంగ్రెస్ నుంచి పంపించడం ద్వారా బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదని స్పష్టం చేశారు. కులగణన తప్పుల తడక అని తాను నిరూపిస్తాన్నారు. సర్వే విష యం లో ముఖ్యమంత్రికే చిత్తశుద్ది లేదని విమర్శించారు. అగ్రకులాలను ఎక్కువ చేసి చూపించారని ఆరోపించారు. సీఎం కుర్చీకి పునాది వేసింది తానేనన్నారు. మహబూబ్ నగర్‌లో వంశీచంద్ రెడ్డి ఓటమికి రేవంత్ కారణమని కూడా ఆరోపించారు.
మల్లన్న ఆరోపణలపై స్పందించిన మధుయాష్కీ
మల్లన్న ఆరోపణలపై మరో సీనియర్ నేత మధుయాష్కీ స్పందించారు. రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న సన్నిహితుడన్నారు. ఆయన ఆరోపణలపై రేవంత్, పీసీసీ చీఫ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరని.. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడు.. మరి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా తనను మాత్రం పిలవలేదన్నారు.
మల్లన్న ఆరోపణల్ని ఖండించిన వంశీచంద్ రెడ్డి
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ చేసిన వ్యాఖ్యలను వంశీచంద్ రెడ్డి ఖండించారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయమని తన గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే మహబూబ్ నగర్‌లో బీజేపీ గెలిచిందని అన్నారు. కేసీఆర్ లాంటి నేతలు ఎంపీగా పని చేసిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లనే తాను ఓడిపోాయనన్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లే లేను : జానారెడ్డి
తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలను జానారెడ్డి ఖండించారు. కులగణన అంశంలో తన పాత్ర లేదని.. మల్లన్న గాలి మాటలు మాట్లాడితే కుదరదన్నారు. తనను ఎవరు తిట్టినా పట్టించుకోనని.. ప్రత్యేక్ష రాజకీయాలకు తాను దూరమన్నారు. సలహాలు అడిగితే ఇస్తానని తెలిపారు. పరిపాలన చేసే వారు సైతం ఆడిగితేనే సలహాలు, సూచనలు ఇస్తానని అన్నారు.
మొత్తంగా తీన్మార్ మల్లన్న రేవంత్, కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వేడి మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: బీజేపీ వరుస విజయాల సీక్రెట్ కిషన్ రెడ్డి - తెర ముందు, తెర వెనుక వ్యూహాల్లో మాస్టర్ !





















