Aam Aadmi Party Status: ఆప్‌ను జాతీయ పార్టీగా గుర్తిస్తున్నారా? ఆసక్తికర సమాధానమిచ్చిన సీఈసీ రాజీవ్ కుమార్
Aam Aadmi Party Status: ఆమ్ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చినట్టేనా అన్న ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు.
Aam Aadmi Party Status:
రివ్యూ చేస్తున్నాం: రాజీవ్
ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ పార్టీయా కాదా..? ఈ చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. గుజరాత్లో బీజేపీపై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ...జాతీయ పార్టీ అనిపించుకోడానికి కావాల్సిన ఓటుశాతాన్ని మాత్రం రాబట్టుకోగలిగింది ఆప్. అప్పటి నుంచి తమది జాతీయ పార్టీయేనని తేల్చి చెబుతోంది. పైగా...ప్రధాని మోదీని ఢీకొట్టగలిగేది తమ పార్టీ మాత్రమే అని చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే...కర్ణాటక ఎన్నికల తేదీలు ప్రకటించే సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్‌కు దీనిపైనే ఓ ప్రశ్న ఎదురైంది. "ఆప్‌ను జాతీయ పార్టీ గుర్తిస్తున్నారా..?" అని ఓ రిపోర్టర్ అడగ్గా...ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి దీనిపై రివ్యూ చేస్తున్నామని చెప్పారు. ఇటీవలే పంజాబ్, హరియాణా కోర్టు లాయర్ హేమంత్ కుమార్ ఎన్నికల సంఘం కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలోనే ఆప్‌ను జాతీయ పార్టీగా గుర్తించాలంటూ ప్రస్తావించారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ ఈ పార్టీ అధికారంలో ఉందని, జాతీయ పార్టీగా కావాల్సిన అర్హత సాధించిందని అన్నారు. ప్రస్తుతానికి ఆప్ ఢిల్లీ, పంజాబ్‌తో పాటు గోవా, గుజరాత్‌లోనూ స్థానిక పార్టీ హోదా సాధించింది. గతేడాది గుజరాత్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక...ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. "ఇకపై మనది జాతీయ పార్టీ" అని కార్యకర్తలతో స్పష్టం చేశారు.
AAP's national party status is under review by the Commission: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/wxTSZD03Q0
— ANI (@ANI) March 29, 2023
ఏదైనా పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా అర్హత పొందుతుంది. ఇప్పటికే దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉంది. గుజరాత్లో 5 స్థానాల్లో విజయం సాధించింది. ఒకవేళ జాతీయ పార్టీగా ఆప్ మారితే.. దేశంలో జాతీయ పార్టీ హోదా సాధించిన ఎనిమిదవ పార్టీగా నిలుస్తుంది. దీంతో పాటు ఈవీఎం మెషీన్లలో మొట్టమొదటి పేరు ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ ఉండనుంది. 2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావించిన ఆప్‌కి ఈ ఫలితాలు కీలకంగా మారాయి. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ కోసం రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకుంటోంది. "మాకు గుజరాత్లో 15-20% ఓట్లు వచ్చినా అది మా విజయంగానే భావిస్తాం. బీజేపీ కంచుకోటలో ఆ మాత్రం ఓట్లు రాబట్టుకోగలిగాం అంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నట్టే కదా. ఎప్పటికైనా బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ మాత్రమే" అని ఎన్నికల ముందు బల్లగుద్ది చెప్పారు కేజ్రీవాల్. ఆ తరవాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం...ఆప్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేసింది. గుజరాత్లో కేజ్రీవాల్ ప్రచారం చాలా అగ్రెసివ్‌గా సాగింది. 20కిపైగా ర్యాలీలు చేపట్టారాయన. గతంలో ఎప్పుడూ లేనంతగా..హిందుత్వ ఓటు బ్యాంకుకీ ఎర వేశారు. ఆ వర్గాన్ని ఆకట్టుకునే వ్యాఖ్యలూ చేశారు. కేజ్రీవాల్ వర్సెస్ మోడీ అనే తన పొలిటికల్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఢిల్లీలో గెలవడం వల్ల ఆప్ మైలేజ్ ఇంకా పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సరైన రీతిలో అభివృద్ధి జరిగితే "ఢిల్లీ మోడల్" అనే ప్రచారాస్త్రాన్ని ప్రయోగించేందుకూ వీలవుతుంది. అది సక్సెస్ అయ్యే అవకాశమూ ఉంటుంది. మొత్తంగా...ఆమ్ఆద్మీ పార్టీకి ఈ విజయం బూస్ట్ లాంటిదే.