Mehul Choksi Arrest: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
Punjab National bank Loan Scam | పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు.

వజ్రాల వ్యాపారి, రూ.13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణం ఎగ్గొట్టి పారిపోయిన మెహుల్ చోక్సీ శనివారం అరెస్టయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. బెల్జియం నుంచి స్విట్జర్లాండ్ పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. తనకు భారత్, ఆంటిగ్వా పౌరసత్వం ఉన్న విషయాన్ని దాటిపెట్టి అక్కడ నివాసం ఉంటున్న మెహుల్ చోక్సీ నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి తమ దేశంలో తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు.
ముంబై కోర్టు చోక్సీని అరెస్టు చేసిన పోలీసులు వజ్రాల వ్యాపారిపై జారీ అయిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పేర్కొన్నారు. మే 23, 2018న ఒకటి, జూన్ 15, 2021 తేదీన మెహుల్ చోక్సీపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. తనకు ఆరోగ్యం బాగోలేదని, వైద్య చికిత్స తీసుకోవాల్సి ఉందని కారణాలుగా చూపి చోక్సీ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. క్యాన్సర్ బారిన పడిన మెహుల్ చోక్సీ బెల్జియంలో చికిత్స పొందుతున్నాడని, భారత్ కు ఇప్పట్లో రాలేరని ఫిబ్రవరి నెలలో వజ్రాల వ్యాపారి తరఫు లాయర్ ముంబై కోర్టుకు తెలిపారు.
భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
మెహుల్ చోక్సీ అరెస్టుపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వారిని భారత్‌కు పట్టుకొస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన మాట నెరవేరుస్తాం అన్నారు. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు భారత్ సాధించిన విజయంగా అభివర్ణించారు. త్వరలోనే ఆయనను భారత్‌కు రప్పించి, బ్యాంకుల వద్ద కాజేసిన సొమ్మును వడ్డీతో సహా ప్రతి రూపాయి రికవరీ చేస్తామన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 13,500 కోట్ల రుణాలు ఎగ్గొటిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ 2018లో భారత్ నుంచి విదేశాలకు పారిపోయాడు. తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ఆంట్వెర్ప్‌లో చోక్సీ నివసిస్తున్నాడు. అతని మేనల్లుడు నీరవ్ మోదీ సైతం అదే కేసులో సహ నిందితుడుగా ఉన్నాడు. లండన్ నుండి భారత్‌కు అప్పగించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ వెలుగులోకి రావడానికి ఒక వారం రోజుల ముందు 2018 జనవరిలో మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ భారతదేశం నుంచి విదేశాలకు పారిపోయారని అధికారులు తెలిపారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో విజిల్ బ్లోయర్ అయిన హరిప్రసాద్ ఎస్వీ చోక్సీ అరెస్టును స్వాగతించారు. చోక్సీ అరెస్టును గొప్ప వార్త అని పేర్కొన్నారు. మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు కావడం భారతదేశానికే కాదు, అతని వల్ల మోసపోయిన వారందరికీ గుడ్ న్యూస్ అని ఆయన ఏఎన్ఐకి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా చోక్సీని భారతదేశానికి తిరిగి తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు. హరిప్రసాద్ జులై 26, 2106న ప్రధాన మంత్రి కార్యాలయానికి రాసిన లేఖలో భారీ స్కామ్ జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన తను ఆ లేఖలో, బ్యాలెన్స్ షీట్లలో ఏదో తప్పు జరిగిందని పేర్కొన్నారు.





















