Arthritis in India : భారత్‌లో పెరుగుతోన్న కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు.. పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా.. మహిళల్లో అయితే రెట్టింపు, కారణాలివే
Arthritis : కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఇండియాలో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయని.. దానికి కారణాలు ఇవేనంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని విషయాలు తెలిపింది. ఇంతకీ రీజన్స్ ఏంటి?

Causes of Arthritis : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్వహించిన స్టడీలో ఇండియాలో ఎక్కువమంది ఆర్థరైటిస్, కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు తేల్చింది. ఇది కేవలం పెద్దలు, వృద్ధుల్లోనే కాకుండా యువతలో, చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతున్నట్లు తెలిపింది. మహిళల్లో ఈ సమస్య రెట్టింపు ఉందట. 22.5 శాతం మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. దానికి గల కారణాలు కూడా వెల్లడించింది. ఇండియాలో ప్రతి 5గురు పెద్దల్లో ఒకరు ఆర్థరైటిస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ప్రధాన కారణాలు ఇవే
జాయింట్ మధ్య ఉండాల్సి స్పేస్ తగ్గిపోయినప్పుడు ఆర్థరైటిస్‌గా చెప్తారు. కేవలం పెద్దలే కాదు యువత కూడా ఈ ప్రమాద అంచుల్లో ఉన్నట్లు గుర్తించింది. అలాగే ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా కొన్ని పాయింట్స్ తెలిపింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
నీరు..
ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలకు నీరే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బావి నీరు వాడుతున్నారని.. దీనిలో ఫ్లోరైడ్, హెవీ మెటల్స్ ఉండడం వల్ల ఫ్లోరోసిస్, కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపింది. ఫ్లోరైడ్ లేని నీటిని.. స్వచ్ఛమైన నీటిని తీసుకుంటే ఈ సమస్యలు కంట్రోల్లో ఉంటాయని చెప్తున్నారు.
జీవనశైలి
ఒబెసిటీ, అధిక బరువు, అన్ హెల్తీ రొటీన్, సరిగ్గా కూర్చోకపోవడం, డైట్లో షుగర్ ఎక్కువగా ఉండడం, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వంటివి కీళ్ల సమస్యలను రెట్టింపు చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి లైఫ్‌స్టైల్‌ని కంటిన్యూ చేస్తే పూర్తి ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా కారణాలే..
స్క్వాట్స్ చేయడం, కాళ్లు ముడుచుకుని ఎక్కువసేపు కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్స్ ఉపయోగించడం, సరైన చెప్పులు లేకుండా వాకింగ్ చేయడం వంటివాటి వల్ల కీళ్లు ఎక్కువగా అలసిపోతాయని.. ఇవి జాయింట్ పెయిన్స్‌కి కారణాలవుతాయని చెప్పారు. అలాగే జాయింట్స్ మధ్య చీలక రావడం, ఎషియల్ టేర్స్ వంటివి వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు.
మహిళలకే రెట్టింపు ప్రమాదం
మహిళలకే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 90 శాతం మంది మహిళలు విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఇది బోన్ హెల్త్‌పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని తెలిపారు. హార్మోనల్ సమస్యలు ఆర్థరైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని.. కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నొప్పిని తీవ్రం చేసే ఉష్ణోగ్రతలు
సమ్మర్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ఈ వేడి ఉష్ణోగ్రతలు కూడా ఇన్ఫ్లమేషన్ని పెంచి.. కీళ్లవాపును తీవ్రం చేస్తాయి. అలాగే జాయింట్స్ పట్టేయడం క్రమంగా ఆర్థరైటిస్ నొప్పిని పెంచేస్తాయి. అలాగే చలికాలంలో కూడా 20 నుంచి 30 శాతం కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
కీళ్ల నొప్పులను దూరం చేసుకునేందుకు లేదా రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైట్‌కి తగ్గట్లు బరువును మెయింటైన్ చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం చేయాలి. హెల్తీ డైట్ పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, సైక్లింగ్, వాటర్ ఏరోబిక్స్ కీళ్లను స్ట్రాంగ్ చేసి.. జాయింట్ సమస్యలు రాకుండా కాపాడుతాయి.
చికిత్సలు
కీళ్లనొప్పి, ఆర్థరైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. వారి సూచనలతో సప్లిమెంట్స్, థెరపీలు తీసుకోవచ్చు. అలాగే గ్లూకోసమైన్, ఓమేగా 3 సప్లిమెంట్స్.. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలు మంచి ఫలితాలు ఇస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















