CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
ధోనీ మళ్లీ కెప్టెన్ అయ్యాడు. సీఎస్కే తలరాత మారుస్తాడు అనుకుంటే ఈ సీజన్ లో అత్యంత ఘోరంగా ఓడిపోయింది ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్. సొంత గడ్డ చెన్నై చెపాక్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు ఘోరంగా ఫెయిలయ్యారు. ఉన్న చిన్నపాటి లక్ష్యాన్ని 10ఓవర్లలోనే ఊదేసి 8వికెట్ల తేడాతో కోల్ కతా ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. చెన్నై చెత్త బ్యాటింగ్
చెపాక్ స్టేడింయలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని సర్ ప్రైజ్ చేశాడు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే. చెన్నైను బ్యాటింగ్ కు ఆహ్వానించి తన నిర్ణయం ఎంత సరైనదో అందరికీ నిరూపించాడు. 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు కాన్వే వికెట్ పడటంతో మొదలైన చెన్నై వికెట్ల పతనం అసలు ఏ దశలోనూ ఆగలేదు. కోల్ కతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది చెన్నై. ఒక్కడంటే ఒక్క బ్యాటర్ కూడా ఆదుకోలేకపోయాడు. దూబే చివర వరకూ అన్నా అసలు ఏం చేయలేని పరిస్థితి. దూబే 31పరుగులతో చేసిన పోరాటం మినహాయిస్తే ధోనీ సహా ఏ బ్యాటర్ కూడా కనీసం 30పరుగులు చేయలేకపోయారు. ఫలితంగా చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగుల స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగింది.
2. ధోని వివాదాస్పద ఔట్
అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నైకి బ్యాటింగ్ చేయటానికి తొమ్మిదో స్థానంలో దిగాడు ధోనీ. అప్పటికి చాలా వికెట్లు పడిపోయినా..ఎవ్వరూ ఆడలేకపోతున్నా ముందొచ్చే ప్రయత్నం మాత్రం ధోనీ నుంచి జరగలేదు. తీరా తనొచ్చాక సునీల్ నరైన్ బౌలింగ్ లో ఎదుర్కొన్న నాలుగో బంతికే LBW గా వెనుదిరిగాల్సి వచ్చింది. వాస్తవానికి నరైన్ వేసిన బాల్ ధోని బ్యాట్ ను తాకుతున్నట్లు స్నికో మీటర్ లో కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అనే నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో ధోని వెనుదిరగాల్సి వచ్చింది.
3. కోల్ కతా స్పిన్ మాస్
కోల్ కతా టీమ్ లో బౌలింగ్ వేసిన ప్రతీ బౌలర్ కి ఈ మ్యాచ్ లో వికెట్లు దక్కాయి. డెవాన్ కాన్వేను అవుట్ చేయటం ద్వారా మొయిన్ అలీ సీఎక్కే వికెట్ల పతానాన్ని ప్రారంభిస్తే..హర్షిత్ రానా రచిన్ రవీంద్ర, అశ్విన్ లను అవుట్ చేశాడు. ఇక సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి అయితే స్పిన్ ఉచ్చు వేసి చెన్నైను ఉక్కిరి బిక్కిరి చేశారు. సునీల్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 13పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. త్రిపాఠీని క్లీన్ బౌల్డ్ చేయటం..రవీంద్ర జడేజాను అవుట్ చేయటం...ధోనీని ఎల్బీ చేయటం ద్వారా చెన్నైను చావు దెబ్బకొట్టాడు నరైన్. మరో వైపు వరుణ్ చక్రవర్తి కూడా పరుగులు పూర్తిగా సీజ్ చేసి విజయ్ శంకర్, నూర్ అహ్మద్ వికెట్లు తీశాడు. ఫలితంగా చెన్నై 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
4. నరైన్ ధనాధన్ :
అటు బౌలింగ్ లో 3 వికెట్ల తేడాతో చెన్నైను చావగొట్టిన నరైన్ 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఓపెనర్ గా వచ్చి పించ్ హిట్టింగ్ తో చెన్నై బౌలర్లకు పిచ్చెక్కించాడు. కేవలం 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 44 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయినా అప్పటికే విజయానికి కావాల్సిన ఊపు తెచ్చిపెట్టి విక్టరీ కి తారురోడ్డు వేశాడు సునీల్ నరైన్.
5. ఐదు ఓటముల చెన్నై
నరైన్ ఓటైనా మిగిలిన పనిని కెప్టెన్ రహానే, రింకూ పూర్తి చేసేశారు. ఫలితంగా 10.1ఓవర్లలోనే 8వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ టార్గెట్ ఛేజ్ చేసి ఘన విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్ లో నెట్ రన్ రేట్ ను ఘనంగా పెంచుకుంది. ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానానికి చేరుకుంది కేకేఆర్. కానీ చెన్నై మాత్రం ఈ సీజన్ లో ఐదు ఓటములు అందుకున్న తొలి టీమ్ గా నిలిచింది. చెన్నై చరిత్రలోనే ఇలా ఐదు మ్యాచులు వరుసగా ఓడిపోవటం ఇదే మొదటిసారి. ఫస్ట్ మ్యాచ్ లో ముంబైపై గెలవటం మినహాయిస్తే ఆర్సీబీ, ఆర్ఆర్, ఢిల్లీ, పంజాబ్, ఇవాళ కేకేఆర్ పై ఓడిపోయి సన్ రైజర్స్ కంటే పైన తొమ్మిదో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.





















