Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్ సేఫ్టీ సెస్
Road Safety Cess in Telangana : తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలదారులకు షాక్ ఇచ్చింది. బైక్‌లకు రూ. 2,000, కార్లకు రూ. 5,000 సెస్సుతో పాటు లైఫ్ ట్యాక్స్ నిబంధనల్లోనూ మార్పులు చేసింది.

Telangana New Road Safety Cess: తెలంగాణలో కొత్త వాహనం కొనడం ఇకపై మరింత భారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే దీనికి కారణం. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా "రహదారి భద్రతా సెస్సు" అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎంత సెస్సు అంటే?
కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై, తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త ద్విచక్ర వాహనంపై రూ. 2,000, కార్లపై రూ. 5,000, భారీ వాహనాలపై రూ. 10,000 రహదారి భద్రతా సెస్సు వసూలు చేస్తారు. దీంతో కొత్త వాహనాల కొనుగోలుపై కొంత అదనపు భారం పడనుంది.
ఎవరికైనా మినహాయింపు ఉందా?
సామాన్య ప్రజలకు కొంత ఊరట కలిగించేలా.. ఆటోలు, ట్రాక్టర్లు, వ్యవసాయ అవసరాలకు వాడే వాహనాలకు ఈ సెస్సు నుంచి మినహాయింపు ఇచ్చారు. రైతులు, చిన్న వ్యాపారులపై అదనపు భారం పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సరుకు వాహనాలకు కొత్త లెక్క
ఇప్పటివరకు సరుకు రవాణా వాహనాలపై ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రవాణా రంగంలో పన్ను విధానం పూర్తిగా మారనుంది.
ఇతర రాష్ట్రాల వాహనాలపై కూడా పన్ను
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా, వాటి వయసును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రాష్ట్రానికి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్‌లో కఠిన నిబంధనలు
రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచేందుకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నిజంగా డ్రైవింగ్ నైపుణ్యం ఉన్నవారికే లైసెన్స్ లభించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వానికి భారీ ఆదాయం
ప్రస్తుతం తెలంగాణలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఈ కొత్త రహదారి భద్రతా సెస్సు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని రోడ్డు భద్రత చర్యలు, ట్రాఫిక్ మౌలిక వసతుల మెరుగుదలకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
మొత్తానికి, తెలంగాణలో కొత్త వాహనం కొనాలంటే ఇకపై ఈ అదనపు సెస్సును కూడా ఖర్చులో లెక్కలో పెట్టుకోవాల్సిందే. రోడ్డు భద్రతే లక్ష్యంగా వచ్చిన ఈ నిర్ణయం వాహన కొనుగోలుదార్లపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















