Telangana Congress: మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
Prem Sagar Rao :మంత్రి పదవి కోసం మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రేస్ ప్రారంభిచారు. ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు.

MLA Prem Sagar Rao starts race for ministerial post: కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల పంచాయతీ సద్దుమణగడం లేదు. మంత్రి వర్గ విస్తరణపై తేదీ తేలడం లేదు. దానికి కారణం ఆశావహులు ఉండటమని అంచనా వేస్తున్నారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన సేవలను హైకమాండ్ గుర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలనుకుంటున్నారని అలాంటి వారికి ఇస్తే సహించేది లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవలను గుర్తించాలన్నారు.
పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న ప్రేమ్ సాగర్ రావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చెన్నూర్‌ఎమ్మెల్యే గడ్డం వివేకానంద, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దాదాపు 14 సంవత్సరాలుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అందరూ కాంగ్రెస్ పార్టీని వీడిపోయినా ఆయన మాత్రం పార్టీ కోసం ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ సజీవంగా ఉందంటే అది ప్రేంసాగర్‌రావు కృషి వల్లనే అని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 66వేలకుపైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు.
గడ్డం వివేక్ నుంచి ప్రధానంగా పోటీ
అయితే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ప్రధానంగా గడ్డం వివేక్ నుంచి పోటీ వస్తోంది. ఆయన ఎస్సీ నేత కావడంతో ప్లస్ గా మారింది. అయితే పలుమార్లు పార్టీ మారి వచ్చారు. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలచిన వెడ్మ బొజ్జు కూడా గిరిజన కోటాలో తనకు పదవి వరిస్తుందనే ఆశతో ఉన్నారు.సామాజిక సమీకరణాలతో తన సీనియార్టీని.. పార్టీకి చేసిన సేవలను గుర్తించకపోతే ఊరుకునేది లేదని ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే చెబుతున్నారు. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తనకు పదవి రాకుండా.. చేసేందుకు జానారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఆశావహులు ఎక్కువగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పునరాలోచన
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయిపోయిందని అనుకులోనేలోపే కొత్త కొత్త అడ్డంకులు వచ్చేశాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలవడంతో మూడో తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందరూ మానసికంగా రెడీ అయిపోయారు. ఎవరెవరికి బెర్తులన్నదానిపై కాంగ్రెస్ లో చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఆ మూడో తేదీ దాటి పది రోజులు అయినా హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈ లోపు పార్టీ నేతుల ఎవరికి వారు తమకు పదవులు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లపై తెరపైకి వస్తున్నారు. ఒకరికి పదవి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే అసంతృప్తి పెరిగి పుట్టి మునిగిపోతుందని అసలు మంత్రి వర్గ విస్తరణనే కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.





















