BRS దశాబ్దపు వృద్ధిని ఒకే ఏడాదిలో దెబ్బతీశారు, దటీజ్ రేవంత్ రెడ్డి: మాజీ మంత్రి హరీశ్ రావు
Telangana News | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వినాశనం కారణంగా పదేళ్ల అభివృద్ధి ఒక్క ఏడాదిలోనే రేవంత్ రెడ్డి నాశనం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ గడిచిన పది సంవత్సరాల్లో (కోవిడ్ మినహాయించి) వార్షిక వృద్ధిరేటు 25.62 శాతం సాధించిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93 శాతం తగ్గుదల నమోదవడం వారి అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనం అని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీసే ముఖ్య కారణాలు ఆయన వెల్లడించారు.
1.HYDRA పేరుతో పేద,మధ్య తరగతి ఇండ్లు కూల్చడం.
2.మూసీ రివర్ ఫ్రంట్ అంటూ నగర అభివృద్ధిపై బుల్డోజర్ ఎక్కించడం.
3.మెట్రో లైన్ ప్రణాళికల్లో అనవసర మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకోవడం.
4.రాష్ట్రానికి కీలకమైన ఫార్మా సిటీని రద్దు చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం.
“ఈ తొందరపాటు నిర్ణయాల కారణంగా ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ ఇప్పుడు వెనుకబాటుకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన ప్రణాళికలను పక్కనబెట్టి, అరుదైన అవకాశాలను కోల్పోతున్నారు” అని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని కాపాడుకోవాలంటే స్పష్టమైన దిశా నిర్దేశంతో మౌలిక వసతులను పటిష్ఠంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.
The Telangana Stamps and Registration Department experienced remarkable growth under the BRS regime, posting a 25.62% annual average growth rate over 10 years (excluding the COVID-19 period). However, under @revanth_anumula leadership, the department recorded a 1.93% decline in… pic.twitter.com/OvklyXQlkX
— Harish Rao Thanneeru (@BRSHarish) April 6, 2025
రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల
మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువ కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేశాం. గత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ల్యాండ్ ఆక్విసేషన్ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. ఇవ్వాళ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి. రంగనాయక సాగర్ లో, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయి. కక్షపూరితంగానే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరం భూ సేకరణ చేయడం లేదు.
కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారు. పంపు హౌస్లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్ని రెడీ ఉన్నాయి. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ఉంది. కానీ ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఎకరా కూడా కాలేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఉన్నది. కొండెంగులకుంట, బిక్కబండ రైతులు అందరూ వస్తె... స్వంత డబులతోని మిషన్లు పెట్టి.. స్వంత డబ్బులు పెట్టీ, భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తున్నాం. ప్రభుత్వం ప్రేమతో పని చేయాలి కానీ కక్షతో పని చేస్తున్నది.
నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడాను. పిల్ల కాలువలు తవ్వితే రైతులకు ఆయకట్టు పెరుగుతుంది. కనీసం 15 20 కోట్లు భూసేకరణ కు విడుదల చేయండి అని కోరాను. అసెంబ్లీలో కూడా కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలిపాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని. కోకాకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం నీళ్లు ఉండబట్టి వచ్చింది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్న.
కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, SLBC సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలిపోయాయి. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. కాళేశ్వరం ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు. సిద్ధిపేట ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాలకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.






















