KTR Open Letter: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
KTRs open letter On Kanche Gachibowli Issue | రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల అటవీ భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కేటీఆర్ లేఖ రాశారు.

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి సమస్యపై HCU విద్యార్థులకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. మన పోరాటం ఇంకా ముగియలేదు. విద్యార్థులారా, నేను మీతో నిలబడతాను. మీకోసం పోరాటం కొనసాగిస్తాను. ఇందులో జోక్యం చేసుకున్న పర్యావరణవేత్తలకు సెల్యూట్ చేస్తున్నాను. అటవీ భూమి పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటం ఇంకా ముగియలేదని, వర్సిటీని ఎక్కడికి తరలించకుండానే అటవీ భూమిని కాపాడుకుందామని హెచ్‌సీయూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తమకు మద్దతు తెలపాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ లేఖ రాశారు. తాను ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా అటవీ భూములతో పాటు వన్య ప్రాణులను సంరక్షించుకునేందుకు పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రతి పౌరుడు కంచ గచ్చిబౌలి అటవీ భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు అని, అలాగనీ అటవీ ప్రాంతానికి చెందిన భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం, టీజీఐఐసీ ఇదివరకే పలుమార్లు స్పష్టం చేశాయి. అక్కడ బుల్డోజర్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెట్లను తొలగిస్తుందని, అటవీ భూములను నాశనం చేస్తుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఆ భూములలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, అక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.
My Humble Appeal to friends who have shown tremendous grit and resolve to stand with the community #SaveKanchaGachibowli #SaveHyderabadBiodiversity pic.twitter.com/r5LVcV5N4I
— KTR (@KTRBRS) April 6, 2025
కంచ గచ్చిబౌలిని రక్షించడానికి పోరాటాన్ని కొనసాగిద్దాం!
డియర్ ఫ్రెండ్స్..
నేను ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ప్రకృతి పట్ల మీకున్న ప్రేమను, మనందరి భవిష్యత్తుపై మీకున్న ఆందోళనను పంచుకునే తోటి పౌరుడిగా ఇది రాస్తున్నారు. కంచ గచ్చిబౌలి అటవీ భూమిని రక్షించడానికి తమ గళం వినిపించిన ప్రతి విద్యార్థి, పర్యావరణవేత్త, జర్నలిస్ట్, ప్రజలు, ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు, వారి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు. మీ ధైర్యం, నిలకడ, విశ్వాసం మొత్తం దేశానికి స్ఫూర్తినిచ్చాయి.
400 ఎకరాల పచ్చదనాన్ని కాపాడటానికి పోరాడదాం. కంచ గచ్చిబౌలిలోని భూములు 734 జాతుల పుష్పించే మొక్కలు, 220 జాతుల పక్షులు, 15 జాతుల సరీసృపాలు, 10 జాతుల క్షీరదాలకు జీవనాధారం. ఈ భూమి కేవలం ఒక రియల్ ఎస్టేట్ కు కాదు. పర్యావరణ వ్యవస్థ, వాతావరణ మార్పులకు తట్టుకుని ఉన్న ఒక కవచం. భవిష్యత్ తరాలకు ఇది ఎంతో ఉపయోగకరం.
మా పోరాటం ఇంకా ముగియలేదు!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థం, వారి స్వలాభం కోసం పర్యావరణ శ్రేయస్సును పణంగా పెట్టాలని చూడటం నన్ను భాదించింది. అభివృద్ధి ముసుగులో ఈ 400 ఎకరాల అటవీ భూమిని లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. పచ్చని చెట్లను, అటవీ సంపదను నాశనం చేస్తున్నారు. కనుక ఇది అభివృద్ధి కాదు, పురోగతి కాదు, దోపిడీ.
ఈ పోరాటంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ముందున్నారు. ఈ భూములను కాపాడుకోవడానికి శాంతియుతంగా, దృఢ నిశ్చయంతో వారు ఉద్యమాన్ని నడిపించారు. వారి ధైర్యానికి అభినందనలు. ఈ విద్యార్థులతో తమ గొంతులను వినిపించి, భుజం భుజం కలిపి నిలిచిన అనేక మంది కార్యకర్తలు, జర్నలిస్టులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. విద్యార్థులు, కొందరు తప్పు చేస్తున్నారంటూ దుష్ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ యూనివర్సిటీని ఇక్కడి నుంచి వేరే చోటికి మార్చుతామంటూ విద్యార్థులలో భయాందోళన పెంచే ప్రయత్నం మొదలైంది. ఈ పోరాటం నుంచి విద్యార్థుల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించారు. ఇది కేవలం యూనివర్సిటీపై జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్య విలువలు, పర్యావరణంపై జరుగుతున్న దాడి.
ఎకో పార్క్.. కప్పిపుచ్చే చర్య
విద్యార్థులు విలాసాలు అడగడం లేదు. వారికి రాజకీయాలు అవసరం లేదు. వారు కేవలం అడవిని రక్షించాలని, 400 ఎకరాల పచ్చదనాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం మొత్తం విశ్వవిద్యాలయాన్ని ఎకో పార్క్‌గా మార్చాలని ప్రతిపాదన చేసింది. భూ ఆక్రమణకు అవకాశం కోసం ఇది మరో కప్పిపుచ్చే చర్యగా అనుమానిస్తున్నాం. విద్యార్థులను పక్కదారి పట్టించడం, మోసపూరితమైన నిర్ణయంగా భావిస్తున్నాం.
విద్యార్థులు ఇలాగే ప్రతిఘటిస్తే మొత్తం విశ్వవిద్యాలయం తరలిస్తామని వారిని బెదిరిస్తున్నారు. అసలు ఉనికిలో లేని ఫ్యూచర్ సిటీలో ప్రత్యామ్నాయ భూమిని అందిస్తామని ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఈ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయి.. ప్రజా సమస్యల కంటే రియల్ ఎస్టేట్ సిండికేట్ లాగా ప్రవర్తిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ వ్యూహాలను చూసి విద్యార్థులు వెనకడుకు వేయవద్దు. ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ జ్ఞానం, ప్రకృతికి నిలయం. దీన్ని "ఎకో పార్క్" అని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. ఇది భూమి గురించి కాదు, మన భవిష్యత్, పర్యావరణం కోసం చేస్తున్న పోరాటం. ఇప్పుడు పోరాటం చేయకపోతే భవిష్యత్తులో మన పిల్లలకు ఏం సమాధానం చెబుతాం.
కలిసికట్టుగా ఉద్యమం చేద్దాం..
ఈ 400 ఎకరాలను మాత్రమే కాకుండా, మొత్తం విశ్వవిద్యాలయాన్ని కాపాడుకునేందుకు ఉమ్మడిగా ఉద్యమం చేద్దాం. ఈ లక్ష్యానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. విశ్వవిద్యాలయానికి ఎటువంటి హాని కలిగించకుండా కంచ గచ్చిబౌలిలోని అటవీ భూమిని రక్షిస్తామని మాటిస్తున్నాం. పర్యావరణాన్ని దెబ్బతీసే ఏ అభివృద్ధి ప్రాజెక్టు రాకుండా చూసుకుంటాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి. ఈ భూమి వేలాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకునే వరకు శాంతియుతంగా, కలిసికట్టుగా పర్యావరణ ఉద్యమాన్ని కొనసాగిద్దామని’ తన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

