Palm Sunday : మట్టల ఆదివారంని క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పామ్ సండే చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
Palm Sunday 2025 : క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకునే అతికొద్ది స్పెషల్ డేలలో పామ్ సండే ఒకటి. అసలు దీనిని ఎందుకు జరుపుకుంటారు. ఆరోజు ఏమి చేస్తారు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

Palm Sunday Christian festival : క్రైస్తవులు భక్తి, శ్రద్ధలతో జరుపుకునే అత్యంత ప్రముఖమైన రోజుల్లో మట్టల ఆదివారం ఒకటి. దీనిని పామ్ సండే అని కూడా అంటారు. శ్రమలకాలం(లెంట్ డేస్)లో ఈ పామ్ సండే వస్తుంది. సరిగ్గా ఈస్టర్కి వారం ముందు.. దీనిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ మట్టల ఆదివారం ఏప్రిల్ 13వ తేదీన వచ్చింది. అసలు ఈ పామ్ సండే అంటే ఏమిటి? దీనిని ఎందుకు జరుపుకుంటారు? మట్టల ఆదివారం వెనక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
పామ్ సండే చరిత్ర
శ్రమలకాలంలో సరిగ్గా ఈస్టర్కి ముందు ఆదివారం యేసు యెరూషలేముకు వచ్చారని చెప్పేందుకు గుర్తుగా మట్టల ఆదివారంను సెలబ్రేట్ చేసుకుంటారు. యేసు గాడిదపై వచ్చినప్పుడు.. అక్కడి ప్రజలు పామ్ ఆకులను ఊపుతూ.. ఆయన వచ్చే దారిలో వాటిని పరిచి.. యేసును స్వాగతించినట్లు క్రైస్తవుల పరిశుద్ధ గ్రంధం బైబిల్ చెప్తుంది. జెకర్యా 9:9లో దీని గురించిన ప్రస్తావన ఉంది. ఆ సమయంలో యేసును హోసన్నా అని పిలుస్తూ.. రక్షకుడిగా అంగీకరించారని చెప్తారు.
మట్టల ఆదివారం ప్రాముఖ్యతలివే..
ఈత ఆకులను విజయం, శాంతి, నిత్యజీవం కు సంకేతంగా భావిస్తారు. యేసును రాజుగా కాకుండా ఆధ్యాత్మిక రక్షకుడిగా క్రైస్తవులు స్వీకరించిన రోజునే పామ్ సండే అంటారు. తమ పాపాలను రక్షించడానికి యేసు ఆ ప్రాంతానికి వచ్చి.. చనిపోయి మళ్లీ తిరిగి లేచారనేది గుర్తు చేసుకుంటూ పామ్ సండేని సెలబ్రేట్ చేసుకుంటారు. చర్చ్‌లను ఈత మట్టలతో డెకరేట్ చేస్తారు. మరికొందరు వీటిని పట్టుకుని ఊరేగిస్తూ ఏసు ప్రవచనాలు చెప్తూ.. పాటలు పాడతారు.
పామ్ సండే రోజు ఉపయోగించిన ఈత ఆకులను భద్రపరిచి.. భస్మ బుధవారం రోజు ఉపయోగిస్తారు. ఈ ఆదివారం తర్వాత వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారంగా చెప్తారు. అనంతరం గుడ్ ఫ్రైడే. ఆరోజు యేసును శిలువ వేసిన రోజని.. ఆ తర్వాత వచ్చే ఆదివారం ఆయన సమాధి నుంచి లేచాడంటూ ఈస్టర్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. దీనినే యేసు పునరుత్థానం అంటారు.
జీసస్ తమ పాపాల కోసం అతని ప్రాణాలు పణంగా పెట్టి లోకాన్ని రక్షించాడాని క్రైస్తవులు నమ్ముతారు. దీనిలో భాగంగానే లెంట్ డేస్ ఫాలో అవుతారు. ఆ నలభై రోజులు శ్రమల దినాలుగా భావించి.. కొందరు తమకు ఇష్టమైన వాటికి ఆ నలభై రోజులు దూరంగా ఉంటారు. మరికొందరు ఉపవాసాలు చేస్తారు. గుడ్ ఫ్రైడే రోజును యేసును శిలువ వేస్తారు. ఆ తర్వాత మూడో రోజు యేసు తిరిగి లేచాడని ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సమయంలో కొత్త బట్టలు ధరించి.. చర్చికి వెళ్లి పాటలు పాడుతూ.. ప్రార్థనలు చేస్తారు.






















