KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
Telangana: హెచ్‌సీయూ భూముల్ని తనఖా పెట్టిన విషయంలో కేటీఆర్ సీరియస్ ఆరోపణలు చేశారు. బీజేపీకి చెందిన ఓ ఎంపీ సంస్థకు రూ. 170 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.

KTR made serious allegations: కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూముల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఐసీఐసీఐ బ్యాంకుకు తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్మీట్ పెట్టారు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. కంచ గచ్చిబౌలిలో ఉన్న నాలుగు వందల ఎకరాలు అటవీ భూమేనని సుప్రీంకోర్టు తీర్పు కూడా దాన్నే ధృవీకరించిందన్నారు. 400 ఎకరాలకు టీజీఐఐసీకి యజమాని కానే కాదని.. కానీ తమ తమది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టు పెట్టిందన్నారు. అసలు భూములు లేకుండా రుణాలు తీసుకునే వారిని చూశాం కానీ.. ఇలా తనవి కాని భూముల్ని ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు.
400 ఎకరాల భూమి విలువ 5,239 కోట్లు అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ చెప్పిందని కేటీఆర్చెప్పారు. కానీ అదే భూమి విలువ 30 వేల కోట్లు అని రెవెన్యూ శాఖ చెప్పిందన్నారు. భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమది కాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెట్టినా డ్తుందని ప్రశ్నించారు.ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా బ్యాంక్ లోన్ ఇచ్చిందన్నారు. లిటికేషన్ భూమికి ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకరేజీ సంస్థ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ సారధ్యంలోనే బ్రోకరేట్ కంపెనీ తీసుకొచ్చారు. ఆ ఎంపీకి రేవంత్ అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెబుతానన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తున్నామని కేంద్రం, ఆర్బీఐ, సీబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అప్పు సృష్టించి ఇప్పించినందుకు బ్రోకరేజ్ సంస్థగా ‘ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్స్ ప్రైవేటు లిమిటెడ్’ వ్యవహరించిందని కేటీఆర్ తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 170 కోట్లు చెల్లించిందన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థికమంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందని.. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటేనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని.. ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ఈ స్కామ్‌కు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే అని స్పష్టం చేశారు.
#HCU భారీ కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డికి అండగా నిలిచిన ఒక బీజేపీ ఎంపీ
— BRS Party (@BRSparty) April 11, 2025
ఒక బీజేపీ ఎంపీ, ఒక బ్రోకరేజ్ కంపెనీ సహకారంతో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డ రేవంత్.
ఆ భూముల మీద టీజీఐఐసీకి ఎటువంటి ఓనర్షిప్ రైట్స్ లేకున్నా ఆ భూములను తాకట్టు పెట్టింది.
-… pic.twitter.com/V7BmHvGUcd
తెలంగాణ ప్రభుత్వం మాత్రం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ కి కేటాయించింది. ఆ భూములను టీజీఐఐసీ ద్వారా తాకట్టు పెట్టించి, 2024 డిసెంబర్‌లో రేవంత్ సర్కారు 10,000 కోట్ల అప్పు తెచ్చిందని చెబుతోంది.
కంచ గచ్చిబౌలి వివాదంపై ఐసీఐసీఐ వివరణ
“మేం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కి (TSIIC) ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదు. అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి టీఎస్ఐఐసీ మా వద్ద ఎలాంటి స్థలాన్ని మార్టిగేజి చేయలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీఎస్ఐఐసీకి అకౌంటు బ్యాంకుగా మాత్రమే వ్యవహరించాము.” అని ఐసీఐసీఐ తమపై వచ్చిన ఆరోపణలపై కీలక ప్రకటన చేసింది.





















