Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Vontimitta Temple: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణమహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్రంలో రామరాజ్యం తెస్తామని కల్యాణోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Vontimitta SeetharRama Kalyanam: శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. వేలాది మంది భక్త జన సందోహం మధ్య కల్యాణోత్సవాన్ని టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీసమేతంగా హజరయ్యి.. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నమే ఒంటిమిట్టకు చేరుకున్న చంద్రబాబు సాయంత్రం కల్యాణ వేదిక వద్దకు వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

సీతారాముల వారే వచ్చినట్లుంది
“వేలాది మంది భక్తుల మధ్య జరిగిన కల్యాణోత్సవాన్ని చూస్తుంటే.. భక్తుల కోసం సీతారాముల వారు దిగొచ్చి కళ్యాణం చేసుకుంటున్నట్లుగా అనిపించింది ” అని చంద్రబాబు అన్నారు. సీతారాముల కళ్యాణాన్ని ఒంటిమిట్టలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని చంద్రబాబు అన్నారు . రాష్ట్ర విభజన తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని ఒంటిమిట్టలో చేయాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిందన్నారు

రామరాజ్యమే నా ఆకాంక్ష
పరిపాలన అంటే రామపాలన అని తరతరాలుగా నమ్ముతున్నాం.. రాముడి పాలన జరగాలని ప్రజలు కోరుకుంటారు. మన తర్వాత వారసులకు కూడా మనం వారసత్వాన్ని అందించాలి. రాముడి పాలన ఇవ్వాలని, రామరాజ్యం తేవాలనేది నా ఆకాంక్ష. రాముడి సాక్షిగా చెప్తున్నా...ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే నా ఆలోచన, ధ్యేయం. రామరాజ్యంలో పేదరికం పోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్‌లో పేదరికం లేకుండా, ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలి. సంపాదనలో కొంత దేవుడుకి ఇచ్చి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మానవ సేవే..మాధవ సేవ. దేవునికి సేవ చేయడం అంటే మనతో ఉన్నవారిని సమానంగా పైకి తీసుకురావడం. శ్రీరాముడి స్ఫూర్తితో పేదలను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరుతున్నా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఒంటిమిట్టలో టెంపుల్ టూరిజం
ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని, ఇక్కడికి వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా సదుపాయాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాంతమంతా దేవుడి నామస్మరణంతోనే ఉండాలి. ఇక్కడి చెరువు ఆధునీకరణకు పనులు ప్రారంభించాం.





















