Vontimitta Sri Kodandarama Swamy: మోహినీ అలంకారంలో జగన్మోహనుడు - దర్శించుకుంటే చాలు మిమ్మల్ని ఆవహించిన మాయనుంచి బయటపడతారు!
VONTIMITTA/TIRUMALA: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఏప్రిల్ 10 గురువారం ఉదయం మోహినీ అలంకారంలో రామచంద్రుడు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు

Vontimitta Sri Kodandarama Swamy Annual Brahmotsavam: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులను అనుగ్రహించే స్వామివారు ఐదో రోజైన ఏప్రిల్ 10 గురువారం ఉదంయ ఏడున్నర గంటలకు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల భజనలు, కోలాటాలతో రామచంద్రుడిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కన్నులపండువగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి రామయ్య కృపకు పాత్రులయ్యారు.

మోహినీ అవతార వృత్తాంతం గురించి భాగవతంలో అత్యంత రమణీయంగా వర్ణన ఉంటుంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం వస్తుంది. దానిని పంచుకోవడంలో భాగంగా దేవతలు, రాక్షసుల మధ్య కలహం ఏర్పడుతుంది. ఆ తగదు తీర్చి...దేవతలకు అమృతం అందించేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంతో సాక్షాత్కరిస్తాడు.

దేవతలందరకీ శ్రీహరి మాయ తెలుసు అందులో పడరు..రాక్షసులు మాత్రం మోహిని మాయలో పడి అమృతం సంగతి పక్కనపెట్టేసి మోహని వెంట పడతారు. అంటే తనకు భక్తులు కానివారు ఆ మాయలోనే ఉంటారనీ తనకు ప్రసన్నులైనవారు ఈ మాయను సులభంగా దాటగలరన్నది ఈ మోహని అవతారం వెనుకున్న ఆంతర్యం. ఈ అలంకారంలో దర్శనమిచ్చే రామచంద్రుడిని దర్శించుకుంటే మిమ్మల్ని ఆవహించిన మాయనుంచి బయటపడతారన్నది పండితుల మాట.

ఏప్రిల్ 11 శుక్రవారం ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య వెన్నెల వెలుగుల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు సకలం సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు పంపిణీ చేసేందుకు ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేశారు.

కల్యాణోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం కడపకు చేరుకోనున్నారు. సాయంత్రం జరగనున్న రాములోరి కల్యాణ వేడుకలో పాల్గొంటారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కల్యాణం అనంతరం రాత్రికి ఒంటిమిట్టలోని TTD గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏప్రిల్ 12 శనివారం తిరిగి కడప ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ వెళ్లనున్నారు.

రెండవ అయోధ్యగా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 06న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11 ఉదయం శివధనుర్భాణ అలంకరణ, సాయంత్రం కల్యాణోత్సవం జరుగుతుంది. ఏప్రిల్ 12 ఉదయం రథోత్సవం, ఏప్రిల్ 13 ఉదయం కాళీయమర్ధనాలంకారం సాయంత్రం అశ్వవాహన సేవ జరుగుతుంది. ఏప్రిల్ 14 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 15 సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.

సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తులందరూ కన్నులారా దర్శించుకునేందుకు వీలుగా కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ పనులు పూర్తిచేసేశారు. 2 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రామయ్య కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















